మెరిట్ పాయింట్ల ఆధారంగా గ్రీన్ కార్డు

హైద‌రాబాద్‌: గ్రీన్ కార్డు జారీలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మార్పులు చేశారు. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను త‌గ్గించే ప్ర‌తిపాద‌న చేశారాయ‌న‌. పాయింట్ల ఆధారంగా అంటే మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డు ఇచ్చే ప్ర‌క్రియ‌కు ట్రంప్ ప‌చ్చ‌జెండా ఊపారు. విద్య, నైపుణ్యం, ఇంగ్లీష్ భాషపై ప‌ట్టు ఉన్న అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ కార్డును జారీ చేయ‌నున్నారు. దీంతో పాటు బోర్డ‌ర్ సెక్యూర్టీ, శ‌ర‌ణార్థుల ప్ర‌క్రియ‌ను మ‌రింత ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. గ‌తంలో కుటుంబ సంబంధాల ఆధారంగా గ్రీన్‌కార్డు జారీ ఎక్కువ ఉండేది. తాజా ప్ర‌తిపాద‌న‌తో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. 2017లో అమెరికా మొత్తం 11 ల‌క్ష‌ల గ్రీన్‌కార్డుల‌ను జారీ చేసింది. ప్ర‌స్తుతం కేవ‌లం 12 శాతం మంది మాత్ర‌మే నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు పొందిన‌వారిలో ఉన్నారు. ఫ్యామిలీ లింకులున్న‌వారిలో 66 శాతం మంది ఉన్నారు. నైపుణ్యం ద్వారా గ్రీన్ కార్డుల‌ను జారీ చేసే శాతాన్ని 57కు పెంచారు. బిల్డ్ అమెరికా.. అమెరికాను నిర్మిద్దాం అన్న నినాదంతోనూ వీసా విధానం జ‌ర‌గ‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. మాన‌వ‌తాకోణంలో విసాలు జారీ చేసే విధానాన్ని కేవ‌లం ప‌ది శాతానికి కుదించారు. గ్రీన్ కార్డు ఉంటే అమెరికాలో ప‌ర్మ‌నెంట్‌గా జీవించే, ప‌నిచేసే హ‌క్కు ఉంటుంది.