బీఎడ్ హాల్‌టికెట్‌పై అమితాబచ్చన్ ఫోటో

లక్నో : ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ అధికారుల నిర్వాకం బయటపడింది. అమిత్ ద్వివేది అనే విద్యార్థి.. గోండా జిల్లాలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయలో బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే బీఎడ్ పరీక్షలకు అమిత్ దరఖాస్తు చేసుకున్నాడు. హాల్‌టికెట్‌పై అమిత్ ఫోటోకు బదులుగా అమితాబచ్చన్ ఫోటో ఉండటంతో సదరు విద్యార్థి అవాక్కయ్యాడు. ఎగ్జామ్ సెంటర్ వద్ద అమిత్‌ను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అమిత్ తన సర్టిఫికెట్లు చూపించడంతో పరీక్షకు అనుమతించారు. ఈ సందర్భంగా అమిత్ ద్వివేది మాట్లాడుతూ.. తన ఫోటోకు బదులుగా అమితాబచ్చన్ ఫోటో హాల్‌టికెట్‌పై ఉండటం చూసి షాకయ్యాను. తన ఇతర ఆధారాలు చూపిన తర్వాతే పరీక్షా హాల్‌లోకి అనుమతించారు. రేపు మార్కుల షీట్‌లో కూడా అమితాబచ్చన్ ఫోటో వస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నానని పేర్కొన్నారు. రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ ఉద్యోగి గుర్‌పేంద్ర మిశ్రా ఈ అంశంపై స్పందించారు. విద్యార్థి తప్పిదం వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. ఇంటర్నెట్ కేఫ్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఒకరి ఫోటోకు బదులుగా మరొకరి ఫోటో అప్‌లోడ్ అయి ఉండొచ్చన్నారు. లేదా యూనివర్సిటీ అధికారులు పొరపాటు చేసి ఉండొచ్చని మిశ్రా పేర్కొన్నారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..