సముద్ర గర్భం నుంచి బుల్లెట్ ట్రైన్!

ముంబైః ఇండియాలో తిరగనున్న తొలి బుల్లెట్ ట్రైన్ మరో ఘనతను సొంతం చేసుకున్నది. ముంబై, అహ్మదాబాద్ మధ్య తిరిగే ఈ బుల్లెట్ రైలు.. మధ్యలో సముద్ర గర్భం నుంచి వెళ్లనున్నది. ఏడు కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైలు సముద్ర గర్భం నుంచి వెళ్లనున్నది. థానె క్రీక్ సమీపంలో ఈ అండర్ సీ టన్నెల్ నిర్మించనున్నారు. అయితే ఇది నిర్మించడం అంత ఈజీ కాదు. మొత్తం 21 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనుండగా.. అందులో ఏడు కిలోమీటర్లు సముద్ర గర్భం నుంచి వెళ్లనున్నట్లు నేషనల హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అచల్ ఖరె వెల్లడించారు. థానె క్రీక్ దగ్గర ఒక్కో దాని మధ్య 250 మీటర్ల దూరంతో మొత్తం 66 బోర్‌హోల్స్ చేశారు. దీనికోసం జపాన్ నుంచి ప్రత్యేకమైన టెక్నాలజీ, మిషనరీని తీసుకొచ్చారు. అలలు ఎక్కువగా ఉన్న సమయంలోనే ఈ పని చేయడానికి వీలుంటుందని, అందువల్ల రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలుండదని అచల్ ఖరె తెలిపారు. 2022, ఆగస్ట్ 15 కల్లా సముద్ర గర్భంలో టన్నెల్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఈ టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కేవలం ఈ టన్నెల్ నిర్మాణానికే రూ.3500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం బుల్లెట్ ట్రైన్ వ్యయం లక్షా పది వేల కోట్లు కాగా.. అందులో జపాన్ నుంచి రూ.88 వేల కోట్ల రుణం తీసుకుంటున్నది. ఈ మొత్తాన్ని 50 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

Related Stories: