వంతెనపై మిస్టరీ

ఓ వంతెనపై అనూహ్యంగా హత్యలు జరుగుతుంటాయి. వాటిని ఛేదించే క్రమంలో ఓ యువ పాత్రికేయురాలికి ఎదురైన అనుభవాలేమిటి? ఈ క్రమంలో ఆమె తెలుసుకున్న విస్మయకర వాస్తవాలేమిటన్నదే యూ టర్న్ చిత్ర ఇతివృత్తం అన్నారు పవన్‌కుమార్. ఆయన దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారి నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం అన్నారు. భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్, నరైన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:నికేత్ బొమ్మి, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కథ, దర్శకత్వం: పవన్‌కుమార్.