గర్భ నిర్ధారణ పరీక్షలపై షీ టీమ్స్ కొరడా...

హైదరాబాద్ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్‌లను రాచకొండ షీ టీమ్స్ అరెస్టు చేశారు. ఉప్పల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణీలకు ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు రాచకొండ షీ టీమ్స్‌కు సమాచారం అందింది. ఈ సమాచారం పై రంగంలోకి దిగి రాచకొండ షీ టీమ్స్, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మంద పల్లవి, ఉప్పల్ పోలీసుల సహకారంతో డెకాయ్ అపేరేషన్‌ను నిర్వహించారు. దీని కోసం షీ టీమ్స్‌కు చెందిన ఎనిమిది నెలల గర్భిణీ మహిళ కానిస్టెబుల్‌ను శ్రీ కృష్ణ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్ సిగిరెడ్డి ఉమమహేశ్వరీ, డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌ను కలిసారు. ముందస్తు గర్భనిర్ధారణ పరీక్ష చేసి కడుపులో ఉన్న బిడ్డ ఎవరనేది చెప్పాలని ఆ మహిల కోరింది. పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డ అని తేల్చి సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీని కోసం భార్యభర్తలైన డాక్టర్లు 7,500 లను వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత పోలీసుల అసలు విషయాన్ని తెలిపి వారి ఇద్దర్నీ అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. 18 ఏండ్ల నుంచి ఉప్పల్ ప్రాంతంలో ఆసుపత్రిని నడిపిస్తున్న డాక్టర్లు గత ఏడాది నుంచి ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే చట్టపరంగా కఠన చర్యలు తప్పవని రాచకొండ షీ టీమ్స్ హెచ్చరించింది. ఇలాంటి పరీక్షలు నిర్వహించే దవాఖానాలు, డాక్టర్ల సమాచారం ఉంటే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నెంబరు 9490617111కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Stories: