అమెరికా అధ్యక్షురాలిగా హిందూ తులసి...???

తులసి గబార్డ్ హిందువు. హిందూ మతగ్రంథాలు, మతాచారాలు బాగా తెలుసు. హవాయీ నుంటి అమెరికా కాంగ్రెస్‌కు నాలుగోసారి ఎన్నికైన తులసి భగవద్గీత మీద పదవీప్రమాణం స్వీకరించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి ఆమె పేరు వినబడుతున్నది. 2020లో ఆమె అమెరికా అధ్యక్ష పదవి చేపట్టవచ్చని భారతీయ-అమెరికన్ డాక్టర్ డాక్టర్ సంపత్ శివాంగి ప్రకటించారు. లాస్‌ఏంజెలిస్ మెడ్‌ట్రానిక్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ప్రకటన చేస్తున్నప్పుడు తులసి అక్కడే ఉన్నారు. అయితే ఆమె తన అభిప్రాయం వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో ఆమె డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని తరచుగా వినిపిస్తున్నది. ఒకవేళ ఆమె గెలిచి అమెరికా సర్వాధికారి అయితే అధ్యక్ష పదవి చేపట్టిన అతిపిన్నవయస్కురాలు, తొలి మహిళా అధ్యక్షురాలుగా ఆమె తిరుగులేని రికార్డు సాధిస్తారు. పైగా తొలి హిందూ అధ్యక్షురాలు కూడా అవుతారు. అయితే ఇక్కడ ఓ గమ్మత్తయిన సంగతి చెప్పుకోవాలి. ఆమె పేరు తులసే, ఆమె హిందువే కానీ ఆమె భారతీయ సంతతికి చెందిన మహిళ కాదు. ఆమె అమెరికన్ సమోవాలో జన్మించారు. తండ్రి క్యాథలిక్ మతస్థుడైన మైక్ గబార్డ్ హవాయీ సెనేటర్‌గా పనిచేశారు. తల్లి యూరపియన్ సంతతికి చెందిన కరోల్ పోర్చటర్ గబార్డ్. ఇద్దరికీ హిందూమతంతోకానీ, ఇండియాతోకానీ ఎలాంటి సంబంధం లేదు. తులసి రెండేళ్లప్పుడు వారు హవాయీకి మారారు. అక్కడే పెరిగిన తులసి తన టీనేజీలో హిందూమతం పుచ్చుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ సభ్యురాలిగా ఆమె భారతీయ సంతతి ప్రజలతో ఎక్కువగా అనుబంధం పెంచుకున్నారు. ఆమె అధ్యక్ష పదవి అవకాశాల గురించి ప్రకటించిన డాక్టర్ సంపత్ శివాంగి నిజానికి రిపబ్లికన్ కార్యకర్త. ఇంకా డెమొక్రాటిక్ పార్టీ తరఫున వినిపిస్తున్న పేర్లలో భారతీయ సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ పేరు కూడా ఉంది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఎంపికైనా డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related Stories: