కేరళకు రాష్ట్ర జెన్‌కో రూ.2.5 కోట్ల విద్యుత్ పరికరాల సాయం

హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళకు రాష్ట్ర జెన్‌కో సాయం పంపింది. వరదల కారణం, విద్యుత్, కమ్యూనికేషన్, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. పునరుద్ధరణ సాహాయక చర్యల్లో భాగంగా కేరళకు రాష్ట్ర జెన్‌కో విద్యుత్ ఉపకరణాలను అందజేసింది. రూ. 2.5 కోట్ల విలువైన పరికరాలను జెన్‌కో.. కేరళకు పంపుతుంది. ఈ విద్యుత్ పరికరాల వాహనాలను మంత్రి జగదీశ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జరిగిన విపత్తు వల్ల సంభవించిన నష్టం ఊహించలేనిదన్నారు. అందాల హరివిల్లు కూలిపోయిన భావన కలుగుతుందన్నారు. కేరళ రాష్ర్టాన్ని అక్కడి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. మానవీయకోణంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. 20 వేల విద్యుత్ మీటర్లు, 100 ట్రాన్స్‌ఫార్మర్లు పంపుతున్నట్లు తెలిపారు. కేరళ వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు వేతనంను రూ.9 కోట్లు విరాళంగా ఇచ్చారన్నారు. కేరళను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎనపీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు అభినందనీయులని మంత్రి పేర్కొన్నారు.

Related Stories: