భారత్, చైనాకు సబ్సిడీలు నిలిపివేయాలి

-అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే -సొంత ఖర్చుతో ప్రపంచాన్ని కాపలా కాస్తున్నాం: ట్రంప్ వ్యాఖ్యలు
షికాగో: భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, అందరికన్నా వేగం గా అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తర డకోటాలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, కొన్ని దేశాలను అభివృద్ధి చెందుతున్న వాటిగా పరిగణిస్తున్నాం. కొన్ని దేశాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి వాటికి సబ్సిడీలు ఇస్తున్నాం. కానీ భారత్, చైనా వంటి దేశాలు వాస్తవంగా అభివృద్ధి చెందుతున్నాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటూ భారత్, చైనా సబ్సిడీలు పొందుతున్నాయి. మనం వాటికి డబ్బు చెల్లిస్తున్నాం. ఇదంతా పిచ్చి పని. ఆ సబ్సిడీలను నిలిపివేయాలి అన్నారు.

డబ్ల్యూటీవో అత్యంత పనికిమాలిన సంస్థ అని ట్రంప్ అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదిగేందుకు డబ్యూటీవో దోహదపడిన విషయం చాలామందికి తెలియదన్నారు. తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు పెద్ద అభిమానినని, అమెరికా నుంచి వారు 50వేల కోట్ల డాలర్లు తీసుకొని అభివృద్ధి చెందడాన్ని అనుమతించరాదని అన్నా రు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెలుపలి నుంచి తాము భద్రత కల్పిస్తున్నందుకు గాను అవి రుసుము చెల్లించాలని చెప్పారు. సొంత ఖర్చులతో ప్రపంచమంతటా తాము కాపలా కాస్తుండగా, అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఆ ఫలాలను అనుభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఇష్టంలేని వారికి సైతం భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు.

అజ్ఞాత వ్యక్తి వ్యాసంతో దేశ భద్రతకు ముప్పు!

న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఇటీవల అజ్ఞాత వ్యక్తి రాసిన ఒక వ్యాసం రచయిత ఎవరో కనుగొనాలని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను ట్రంప్ ఆదేశించారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగించేవని భావించే కొందరు అధికారులు ఆయన నిర్ణయాలను అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ఆ రచయిత పేర్కొన్నారు. సదరు రచయిత ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి అని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇది దేశ భద్రత ప్రయోజనాలకు భంగం కలిగించే అంశమని, అందువల్ల ఆ రచయిత ఎవరో కనుగొనాల్సి ఉందని ట్రంప్ అన్నారు. ఆ రచయిత పేరు వెల్లడించకపోతే సదరు పత్రికపై చర్య తీసుకుంటానని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

Related Stories: