దీపావళి జరిపాడు.. హిందువులను మరిచాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టయిలే వేరు. మీడియాకు దూరందూరం అంటారు. కానీ ట్విట్టర్‌లో ఫట్‌ఫట్‌లాడిస్తారు. కాకపోతే అప్పుడప్పుడూ తప్పులో కాలేస్తారు. అమెరికాలోని మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా ఆయన దీపావళి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే వారంరోజులు ఆలస్యంగా. మంగళవారం వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్ రూంలో పూలతో అలంకరించిన వేదిక మధ్యన అమర్చిన దీపాన్ని ఆయన వెలిగించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని భారతీయ ప్రముఖులను, భారత రాయబారిని ఆహ్వానించారు. ఆ తర్వాత యథావిధిగా ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సిక్కులు, బౌద్ధులు, జైనులు దీపావళి జరుపుకుంటారని అందులో తెలిపారు. తాళము వేసితిని గొళ్లెము మరచితిని అన్న చందంగా ఆయన హిందువుల గురించి ప్రస్తావించడమే మరిచిపోయరు. దీనిపై నెటిజనులు గగ్గోలు పెట్టారు. హిందువులు ఏమయ్యారు? మహానుభావా అని ప్రశ్నలు సంధించారు. దాంతో మొదటి ట్వీట్ పీకేసి మరో ట్వీట్ పెట్టారు. అందులోనూ హిందువుల ప్రస్తావన లేదు. మళ్లీ గగ్గోలు. ముచ్చటగా మూడోసారి ఆయన హిందూపండుగ అని ప్రస్తావించడంతో నెటిజనులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Related Stories: