మ్యానిఫెస్టోపై టీఆర్‌ఎస్ కసరత్తు

-ఇప్పటికే 15 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు -వినాయక చవితి తర్వాత తొలి సమావేశం -అన్నివర్గాల సమస్యల పరిష్కారానికి సూచికగా కూర్పు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణను టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోలో వెల్లడించనున్నది. ఇందుకు అనుగుణంగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 15 మందితో ఇప్పటికే మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల నాయకులు ఉండేలా కూర్పు చేశారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మహిళలు, మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బీసీలు ఉండేలా కమిటీని నియమించడం ద్వారా అన్నిస్థాయిల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చుతారు. మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై పార్టీ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు నేతృత్వంలో కమిటీ కసరత్తు చేస్తున్నది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ పూర్తిగా నెరవేర్చినందున ఇంకా ఏమైనా అమలు చేయాల్సిన అంశాలు ఉంటే ఇందులో చేర్చుతారు.

ఇప్పటికే పలువర్గాలు తమ అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చాలంటూ పార్టీ ముఖ్య నాయకులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నాయి. వీటిన్నంటినీ అధ్యయనం చేసిన తర్వాత మ్యానిఫెస్టోలో చేర్చుతారు. వినాయక చవితి తర్వాత కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో మ్యానిఫెస్టోపై ప్రాథమికంగా కసరత్తు చేయనున్నారు. దూదేకుల సంఘం తమ వర్గానికి సంబంధించిన సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చాలంటూ ఎంపీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వంలోని వివిధశాఖల ద్వారా చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను ఇందులో చేర్చే అవకాశం ఉన్నది. అన్నివర్గాల ప్రజల సమస్యలను, బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇందులో వివరించనున్నారు. కమిటీ ప్రాథమిక కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నది. కేసీఆర్ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను ఖరారు చేయనున్నారు. మ్యానిఫెస్టో విశ్వసనీయత పెరిగేలా అంశాలను చేర్చాలనే ఆలోచనలో కమిటీ సభ్యులు ఉన్నారు.