కాంగ్రెస్‌కు భయం జ్వరం

-కాంగ్రెస్, టీడీపీలది అనైతిక, అధర్మ పొత్తు -కాంగ్రెసోళ్ల ఒకనాటి తప్పులు నేడు దయ్యాలై వాళ్లనే వెంటాడుతున్నాయి -వందకు పైగా స్థానాల్లో గెలుస్తాం.. మీడియాతో ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు భయం జ్వరం పట్టుకున్నదని చెప్పా రు. ప్రతిపక్షాలకు అనేక స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరుకని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వందకుపైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తు అనైతికం, అధర్మమైందని, ప్రజలు వీరి పొత్తును తిప్పికొడుతారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడితేనే గెలుస్తామనే ఆలోచన టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు చేసిన తప్పులే నేడు దయ్యాలై వాళ్లనే వెంటాడుతున్నాయన్నారు. ఎంపీ డీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి నష్టం చేయలేదని, భూపతిరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత స్థానం కల్పించామని అన్నారు. కొండా సురేఖ పార్టీని వీడేముందు ఏదో ఒక ఆరోపణ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడారని తెలిపారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేవారికి భవిష్యత్ తప్పక ఉంటుందన్నారు.