టీఆర్ఎస్ అభ్యర్థులకు అందుబాటులో ప్రచార సామాగ్రి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థులందరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లతో మమేకమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అవసరమైన ప్రచార సామాగ్రిని సరఫరా చేసింది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రి తరలింపు పూర్తయింది. సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ప్రచార సామాగ్రిని పంపిణీని పర్యవేక్షించారు.

సోమవారం హైదరాబాద్ నుంచి ప్రచార సామాగ్రిని నియోజకవర్గాల వారిగా డీసీఎం వ్యాన్ లో రవాణా చేశారు. ఈ ప్రచార సామాగ్రిలో వివిధ సైజుల్లో పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, బ్యాడ్జిలు, కారు గుర్తు , కేసీఆర్ చిత్రపటంతో కూడిన జెండాలు, బంటింగ్స్ ఉన్నాయి. గ్రామ గ్రామాన జరిగే అభ్యర్థుల ప్రచారం, వాహన ర్యాలీలు, బహిరంగ సభలకు అవసరమైన సామాగ్రి ఇందులో ఉంది. ప్రచార సామాగ్రి అందించడంతో పార్టీ కేడర్ లో నూతనోత్సాహం కనపడుతుంది. ప్రచారం మరింత ఊపందుకుంటుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ ప్రచార హోరు తెలిపే విధంగా సామాగ్రి ఉంటే సరికొత్త జోష్ వస్తుందని అభ్యర్థులంతా చెబుతున్నారు.

90 శాతానికి పైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ప్రత్యర్థులకు కంగుతినిపించిన కేసీఆర్... ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాకముందే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని పార్టీ అభ్యర్థులకు సూచిస్తున్నారు. దీంతో అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే ఊపు ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తామంటూ వందలాది గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు.

Related Stories: