ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే..: టీఆర్‌ఎస్ యూకే

లండన్: అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యూకే తెలిపింది. తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏదైనా తెలంగాణ శ్రేయస్సు కోసమేనని, ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని, నాడు రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, నేడు అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణంలో రెట్టింపు త్యాగాలు చేసి ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ రాష్ర్టాన్ని ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో నిర్మిస్తుందని తెలిపారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, కేసీఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై స్పందించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 32కు పైగా దేశాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు ఏర్పడ్డాయని, ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాలతో చర్చించి యావత్ ఎన్నారై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని ప్రతినిధులు తెలిపారు. ఎన్నారైల సమస్యలపై మ్యానిఫెస్టో కమిటీకి నివేదికలు అందజేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఘాటైన విమర్శ, ప్రతిస్పందన ఉంటుందని, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌కి మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ..ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సన్నద్ధం కావాలని సవాల్ చేశారు. గాంధీభవన్‌లో కూర్చొని ఇంకా విమర్శించుకుంటూ ఉంటే మళ్లీ కేసీఆర్ ప్రమాణస్వీకారం కూడా అయిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శులు సృజన రెడ్డి చాడ, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి బండ సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..