ప్రతిపక్షాల పొత్తు నీతిమాలిన చర్య

-అభివృద్ధిని అడ్డుకోవటడమే వారి ఎజెండా -తెలంగాణ ద్రోహి చంద్రబాబు.. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టుపార్టీలు బరితెగిస్తున్నాయని, ఇందులో భాగంగానే అనైతిక పొత్తుకు సిద్ధమయ్యాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకున్న పార్టీలు.. ఇప్పుడు ఆధికార దాహం కోసం సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయని విమర్శించారు. నీతిమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని, ఎన్నికల్లో అనైతికపొత్తు పెట్టుకున్న పార్టీలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంగళవారం టీఆర్‌ఎస్ భవన్‌లో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బషీర్‌బాగ్ కాల్పులతో టీడీపీ, ముదిగొండ మారణకాండతో కాంగ్రెస్ చరిత్రలో ద్రోహులుగా ముద్ర వేసుకున్నాయని, ఆ రెండు సంఘటనలపై తీవ్రంగా పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఆ పార్టీలతో ఎలా పొత్తుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, ఆయన తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రచారానికి గ్రామాల్లోకి రానివ్వరని హెచ్చరించారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకానికి జరుగుతున్న రెఫరెండం అని కర్నె ప్రభాకర్ అన్నారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని, కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డి పై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.