జానారెడ్డి గులాబీ కండువా కప్పుకొంటే టికెట్ త్యాగం చేస్తా

-మాట ప్రకారం టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేయాలి -నాగార్జునసాగర్ అభ్యర్థి నోముల నర్సింహయ్య
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకొంటే తన టికెట్‌ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చెప్పారు. జానారెడ్డి గతంలో ఇచ్చినమాట ప్రకారం టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేయాలని అన్నారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటలపాటు కరంట్ ఇస్తే టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానా గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. త్యాగాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పదవులు త్యాగంచేసి స్వరాష్ట్రం సాధించారని చెప్పారు. ముఖ్యమంత్రి అంగీకారంతో తన ఎమ్మెల్యే టికెట్‌ను జానారెడ్డికి ఇచ్చేందుకు వెనకాడబోనని నర్సింహయ్య స్పష్టంచేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 సీట్లలో టీఆర్‌ఎస్ జెండాఎగురవేస్తుందని, నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గల్లంతవుతారని జోస్యం చెప్పారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుకుపోతున్నదని, ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నోముల ధీమా వ్యక్తంచేశారు. ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే రైతులకు రూ. 100 కోట్ల విలువ చేసే రైతుబంధు చెక్కులు అందాయని, రైతుబీమా ద్వారా పదిమంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తికాదని అన్నారు. కాంగ్రెస్‌లో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదని, అలాంటిది రాష్ట్రాన్ని ఎలా నడిపించగలుగుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కేవలం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుతోనే సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. స్థానికంగా ఉండకుండా, ప్రజల సమస్యలను పక్కనపెట్టిన జానారెడ్డిని ఓడించేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.