కనుల పండువగా భద్రాద్రి అధ్యయనోత్సవాలు

- రెండో రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చిన రాముడు - వీక్షించి తరించిన భక్తజనం - భద్రాద్రిలో కోలాహలంగా స్వామివారి ఊరేగింపు - రేపు వరాహావతారంలో భద్రాద్రి రాముడు భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరుగుతున్న శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇవాళ భద్రాద్రి రాముడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అర్చకులు రామాలయం తలుపులు తెరిచారు. పవిత్ర గోదావరి నదీతీరం నుంచి అర్చకస్వాములు పుణ్యజలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ జరిపారు. స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, ఆరగింపు నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. స్వామివారిని ఆలయంలో అర్చకస్వాములు అందంగా ముస్తాబు చేశారు. తదుపరి పల్లకీపై వేంచేంపచేసి నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాట నృత్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. మార్గమధ్యంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కూర్మావతారంలో ఉన్న స్వామివారిని మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఆశీన్నులు గావించారు. రామయ్య సోమవారం వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు.

Related Stories: