టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సర్వత్రా జనామోదం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రచారం జోరం దుకుంటున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఊరూరా, వాడవాడలా జనామోదం లభిస్తున్నది. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులను ఆయా గ్రామాల ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల నుదుట మహిళలు తిలకం దిద్ది, మంగళహారతులిచ్చి జయజయధ్వానాలు చేస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటా ప్రచారాలకు విశేష స్పందన లభిస్తున్నది. పలుగ్రామాల్లో టీఆర్‌ఎస్‌కే తమ ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామంలోని 42 మహిళాసంఘాల గ్రూప్‌లీడర్లు సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కే తారకరామారావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్‌కు ఓటువేస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ముస్లింలు తీర్మానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు, కమలాపూర్‌కు చెందిన విశ్వబ్రాహ్మణులు, ఆటో యూనియన్ నాయకులు ఈటలకు మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్‌తండా, పోచారంతండాకు చెందిన గ్రామస్థులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మద్దతుగా కొత్తపల్లి మండలం బొమ్మకల్ అనుబంధ గ్రామం గుంటూరుపల్లి ప్రజలు ఏకగ్రీవ తీర్మానంచేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మహిళలు టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌ను గెలిపించుకుంటామని ప్రమాణం చేశారు.

వనపర్తి అభ్యర్థి సింగరెడ్డి నిరంజన్‌రెడ్డికి పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామ రైతులు మద్దతు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కే ఓటు వేస్తామని ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామ యాదవ సంఘం నాయకులు తీర్మానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాళ్లకుంట కాలనీవాసులు, మహిళాసంఘాల సభ్యులు తీర్మానించారు. మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం తిమ్మాయిపల్లి గ్రామస్థులంతా అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు తమ గ్రామంలోకి రావద్దంటూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌కు సీపీఐ సీనియర్ నాయకుడు పెంచల ఐలయ్య మద్దతు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్ కాలనీవాసులు శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీకే ఓటువేస్తామని ఏకగ్రీవ తీర్మానంచేశారు. ఉప్పల్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డికి ఎస్సీ ఉపకులాల ప్రతినిధులు మద్దతు పలికారు. కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానందకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మద్దతు తెలిపారు.