నేనేనా రాసిందని..సిగ్గుపడతాను!

త్రివిక్రమ్ తన మాటలతో మాయ చేస్తాడు. ..గిలిగింతలు పెడతాడు.. ఆలోచింపచేస్తాడు.జీవిత సత్యాలను జోడిస్తాడు. మోములపై నవ్వుల వెన్నెల్ని పూయిస్తారు. అచ్చ తెలుగు నుడికారంతో, ఆర్థ్రమైన భావాలతో మెరుపుల్ని మెరిపిస్తారు. ్ర పేక్షకుల హృదయసీమల్లో వెలుగుల్ని నింపుతారు. రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్న త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం అరవిందసమేత వీరరాఘవ.ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో త్రివిక్రమ్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...

ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని చెప్పారెందుకని?

హరికృష్ణ దూరమైన బాధలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఉంది. ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎలా మొదలుపెట్టినా మళ్లీ ఆ సంఘటన గురించే మాట్లాడాల్సివస్తుంది. అందుకే మౌనమే మంచిదనిపించింది.

తండ్రి చనిపోయిన తర్వాత నాలుగో రోజునే ఎన్టీఆర్ షూటింగ్ పాల్గొన్నారు. ఆ నిర్ణయం ఎవరిది?

హరికృష్ణ చనిపోయిన రోజు నేను, నిర్మాత చినబాబు ఎన్టీఆర్‌తోనే ఉన్నాం. ఆ తర్వాత రోజు రాత్రి ఎన్టీఆర్ మాకు ఫోన్ చేసి ఎలాగైనా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేద్దాం. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దని మాలో భరోసాను నింపే ప్రయత్నం చేశారు. పది రోజుల తర్వాత వాటి గురించి మాట్లాడుకుందామని మేము చెప్పినా వినలేదు. నాలుగో రోజునే షూటింగ్‌లో పాల్గొన్నారు.

సినిమాలో తండ్రి పాత్రధారి చితికి నిప్పటించే సన్నివేశాల్ని హరికృష్ణ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ పై చిత్రీకరించారని తెలిసింది?

ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ అప్పటికే పూర్తయ్యాయి. తండ్రి చితికి నిప్పటించే సన్నివేశాలు మాత్రమే మిగిలాయి. వాటిని చిత్రీకరించడం బాధను కలిగించింది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అగ్ర కథానాయకులు సినిమాలు చేసి చాలా కాలమైంది. ఎన్టీఆర్‌తో సినిమా కోసం ఈ తరహా కథను ఎంచుకోవడానికి కారణమేమిటి?

ఫ్యాక్షనిజం తాలూకు కథల్లో హింస, పోరాటాలు ప్రేక్షకులకు కిక్‌నిస్తాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ కథ. ఈ గొడవల్లో కన్నుమూసిన వారి కుటుంబాలు, వారిని హతమార్చిన వారు సంతోషంగా ఉంటారా? అనే అంశాన్నే ఈ సినిమాలో చూపించాం. ఫ్యాక్షనిజం కారణంగా ఆడవాళ్లు పడుతున్న వ్యథల్ని హృద్యంగా ఆవిష్కరించాం.

మీ సినిమా అంటే ప్రేక్షకులు సరదా సంభాషణలు,, పంచ్‌లు, వినోదాన్ని ఆశిస్తుంటారు. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయా?

ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల్లో నాశైలి వినోదం ఉంటుంది. అవి తప్ప సినిమాల్లో ఎక్కడా బలవంతపు హాస్యంతో ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేయలేదు. ఇదివరకు బ్రహ్మానందం లాంటి హాస్యనటులను ఉపయోగించి ప్రత్యేకమైన ట్రాక్‌లు చేసేవాణ్ణి. వాటి జోలికి పోకుండా నిజాయితీగా ఈ కథను చెప్పాం.

ఒకప్పటితో పోలిస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం, హింస తగ్గింది. కానీ సినిమాల్లో మాత్రం అక్కటి ప్రజల్ని క్రూరంగా చూపిస్తున్నారు. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయా?

రాయలసీమలో ఉండే హింసను కాకుండా ఆ ప్రాంత సొగసును ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రమిది. ఈ ప్రాంతంలో ప్రజలు వాడే సగడిపొద్దు, పాపోడు లాంటి పదాలు సినిమాలో వినిపిస్తాయి. రాయలసీమ భాషా,యాస తాలుకూ అందాన్ని సహజంగా చూపించాం.

ఎన్టీఆర్‌తో మీకు పన్నెండేళ్లుగా స్నేహం ఉంది. ఆయనతో సినిమా చేయడానికి ఇన్నాళ్లు సమయం తీసుకోవడానికి కారణం ఏమిటి?

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా అనుకున్నాను. నాన్నకు ప్రేమతో తర్వాత అది బలపడింది. ఆయనకో మూడు కథలు వినిపించాను. వాటిలో రెండు నచ్చలేదు ఎప్పుడైనా అర్ధరాత్రి ఏదైనా ఐడియా తడితే రాసి పడుకుంటాను. తర్వాత రోజు ఉదయం దానిని చదివితే నేనేనా రాసిందని సిగ్గుపడతాను. ఇదివరకు నేను చేసిన కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే భావన కలిగింది(నవ్వుతూ).

అజ్ఞాతవాసి సినిమా విషయంలో మీపై చాలా విమర్శలు వచ్చాయి. విదేశీ చిత్రం నుంచి స్ఫూర్తి పొందారనే విమర్శలు వచ్చాయి?

ఆ వార్తలన్నీ నేను చదివాను. వాటి గురించి ప్రత్యక్షంగా నాతో ఎవరూ మాట్లాడలేదు. విదేశీ దర్శకుడికిగానీ, ఆ సినిమా హక్కులు పొందిన టీ సీరిస్ సంస్థకు నేను డబ్బులు ఇవ్వలేదు. ఒకవేళ వారు వచ్చి అడిగితే బాధపడుతూనే డబ్బులు ఇచ్చేవాణ్ణి. సినిమా పరాజయం పాలవ్వడంతో నిర్మాత నష్టపోకూడదని నా పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాను.అంతకుమించి ఏమీ జరగలేదు.

తెలుగు చిత్రసీమ గమనంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని అనుకుంటున్నారు?

మూసధోరణిని బద్దలు కొట్టి నవ్యపంథాకు నాంది పలకడం అంత సులభం కాదు. ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల్ని అలరించడానికి చాలా మంది భయపడుతుంటారు. ఎవరైనా కొత్తగా అడుగులు వేస్తే వారి దారిలో నడవడానికే ప్రయత్నిస్తారు. అందుకు నేను అతీతుడనేమీ కాదు. తెలుగులో తొలి కలర్ సినిమా లవకుశ వచ్చిన తర్వాత కూడా పన్నెండేళ్ల పాటు బ్లాక్‌అండ్ వైట్ సినిమాలే వచ్చాయి. కలర్‌లో సినిమాలు తీయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. మనలో ఉన్న భయమే అందుకు కారణం. ప్రతి పది, పదిహేను ఏళ్లకు చిత్రసీమలో మార్పుల జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రయోగాలు చేయడానికి మీరు సిద్ధమేనా?

నేను ఒక్కడినే చేస్తే సరిపోదు. అందరూ ఆ ప్రయత్నాలు చేయాలి. ఒకప్పుడు వినోదం కోసం సినిమాలు చూడటానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు టీవీషోలు, సిరీస్‌లు అందుబాటులోకి రావడంతో వినోదం కోసం థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. కామెడీ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లు సినిమాల్లో పెడితే తిడుతున్నారు. ఆ సమయాన్ని కథ చెప్పడానికే వినియోగించవచ్చు కదా అంటున్నారు. మరో నాలుగైదు ఏళ్లలో సినిమాల పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అనిపిస్తుంది.

ప్రస్తుతం వినూత్న ఇతివృత్తాలతో కొత్త దర్శకులంతా ప్రతిభను చాటుకుంటున్నారు. వారి సినిమాలు చూస్తుంటారా?

విడుదలైన ప్రతి సినిమాను థియేటర్‌లో చూస్తాను. మంచి సినిమా చూసినప్పుడల్లా ఈర్ష్య, కోపం కలుగుతాయి. మంచి సినిమా తీయాలనే కసి ఇంకా పెరుగుతుంది. రంగస్థలం, అర్జున్‌రెడ్డి, పెళ్లిచూపులు, గూఢచారి, కేరాఫ్ కంచెరపాలెం, ఆర్‌ఎక్స్100 సినిమాలన్నీ నచ్చాయి.

దర్శకుడికి సినిమా బడ్జెట్ పట్ల ఎంతవరకు అవగాహన ఉండాలని అనుకుంటున్నారు. ?

కొంతే ఉండాలి. ఎక్కువ ఉంటే కథపై ఆ ప్రభావం పడుతుంది. విదేశాల్లో అనుకున్న కథ ఇండియాకు మారుతుంది. దాంతో మనం చెప్పాలనుకున్న విషయం, ఎమోషన్ మారిపోతుంది. జాగ్రత్తగా తీస్తే ఎంత ఖర్చు చేసినా సినిమా వర్కవుట్ అవుతుంది. 1962లో వచ్చిన సంగం సినిమాను యూరప్‌లో 120 మంది సభ్యులతో 60 రోజుల పాటు షూటింగ్ చేశారు. కానీ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

ఈ సినిమాతో ఎలాగైనా విజయం అందుకోవాలనే ఒత్తిడి మీపై ఏమైనా ఉందా?

ప్రతి సినిమా బాగా చేయాలి, మంచిగా ఆడాలని అనుకుంటాం. కానీ అది మన చేతిలో ఉండదు. పనిలో పడితే అన్ని మర్చిపోతాం. షూటింగ్‌లో ఉండే ఆనందం, ఉత్సుకత వాటిచూట్టే ఆలోచలన్నీ ఉంటాయి.

గత సినిమాలతో పోలిస్తే ఎన్టీఆర్‌ను ఇందులో కొత్తగా చూపించినట్లున్నారు?

ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పాత్రల పరంగా ఎన్టీఆర్ చూపించిన హావభావాలను ఇందులో పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డాను. స్టార్ హీరోల బలాన్ని వాడుకుంటూనే చిన్న చిన్న మార్పులు చేస్తుంటాను.

వెంకటేష్‌తో హారిక హాసిని సంస్థలో మీరు ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు?

వెంకటేష్‌తో సినిమా చేయాలి. కానీ కథ కుదరడం లేదు.

పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మీ మధ్య ఉన్న స్నేహంలో ఏమైనా మార్పులు వచ్చాయా?

మా మధ్య సినిమాలకు సంబంధించి ప్రస్తావన ఎప్పుడూ రాదు. పదేళ్ల క్రితం ఉన్న స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది. ఏ మాత్రం మారలేదు. చాలా ఏళ్లుగా ఆయన్ని చూస్తున్నాను. కాలక్రమంలో ఆయనలో పరిణితి వచ్చింది. బెటర్ పర్సన్ అయ్యారు.

× RELATED అంతరిక్షాన్ని సృష్టించారు!