అంబులెన్స్ కోసం ప్రెసిడెంట్ కాన్వాయ్‌నే ఆపేశాడు..

బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన ట్రాఫిక్ ఎస్సై ఎంఎల్ నిజ‌లింగ‌ప్పపై ఇప్పుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ది. గ‌త శ‌నివారం ఆయ‌న చూపిన తెగువ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న‌ది. న‌గ‌రంలో మెట్రో గ్రీన్ లైన్ ప్రారంభోత్స‌వం కోసం వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాన్వాయ్‌ను ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆపేశాడు. ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకోవ‌డాన్ని గ‌మ‌నించిన ఆ ఎస్సై ఈ ధైర్యం ప్ర‌ద‌ర్శించాడు. అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు నిజ‌లింగప్ప ఏకంగా ప్రెసిడెంట్ కాన్వాయ్‌నే ఆపేశాడు. రాష్ట్ర‌ప‌తి కాన్వాయ్ రాజ్‌భ‌వ‌న్ వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెచ్ఏఎల్ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను గ‌మ‌నించిన ట్రాఫిక్ ఎస్సై ఈ చ‌ర్య‌కు పూనుకున్నాడు. భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ ఈజీగా వెళ్లేందుకు నిజ‌లింగ‌ప్ప మిగితా వాహ‌నాల‌కు దారిచూపాడు. ట్రాఫిక్‌ పోలీస్ డిప్యూటీ క‌మీష‌న‌ర్ అభ‌య్ గోయ‌ల్ ఎస్సై నిజ‌లింగ‌ప్పపై ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంసించారు. ప్ర‌థ‌మ పౌరుడిని ప‌క్క‌న‌పెట్టి, అంబులెన్స్ దారి ఇచ్చిన ట్రాఫిక్ ఎస్సైకి భారీ రివార్డును ప్ర‌క‌టించారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం