ముంచుకొస్తున్న ఫ్లారెన్స్

-అమెరికాకు మరో హరికేన్ ముప్పు - గురువారం రాత్రి తర్వాత తీరం దాటే అవకాశం
చార్లెస్టన్, సెప్టెంబర్ 11: హార్వే, ఇర్మా హరికేన్ల దెబ్బనుంచి అమెరికా కోలుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తున్నది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన ఫ్ల్లారెన్స్ హరికేన్ అమెరికా తూర్పుతీరం వైపు కదులుతూ పుంజుకుంటున్నది. ఇది క్యాటగిరి-4 హరికేన్‌గా బలపడుతున్నదని జాతీయ హరికేన్ కేంద్రం ప్రకటించింది. ఈ హరికేన్ ప్రస్తుతం బెర్ముడాకు 1100 కి.మీ.ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఉత్తర కరోలినా, వర్జీనియా రాష్ర్టాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొన్నది. తీరం దాటే సమయంలో కుండపోత వర్షాలు కురుస్తాయని, గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హరికేన్ ఫ్ల్లారెన్స్.. అమెరికా తూర్పు తీరంలో ఉన్న రాష్ర్టాల్లో.. ముఖ్యంగా ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ర్టాల్లో భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.