నేటినుంచి టీఆర్‌ఎస్కేవీ రెండోవిడుత సభలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో రెండోవిడుత సమావేశాలు గురువారం (ఈ నెల 22) నుంచి నిర్వహిస్తున్నట్టు టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్కేవీ ఆధ్వర్యంలో ఇప్పటికే 42 నియోజకవర్గాల్లో ఎన్నికల సభలు నిర్వహించి.. సీఎం కేసీఆర్ కార్మికులు, ఉద్యోగులకు అమలుచేసిన సంక్షేమ పథకాలు, వేతనాలు పెంచిన విషయాలను ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ మార్కెట్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటోడ్రైవర్ల అడ్డాల వద్ద గ్రూప్ సమావేశాలు నిర్వహించి ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రచారసభలు నిర్వహించనున్నట్టుగా పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్కేవీ అనుబంధసంఘాల నాయకులు సమావేశాలను జయప్రదంచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ముథోల్, సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ అర్బన్, 23న దుబ్బాక, సిరిసిల్ల, 24న వరంగల్ తూర్పు, 25న ఉదయం మేడ్చల్, 26న ఎల్బీనగర్, 27న భద్రాచలం, 28న మునుగోడు, 29న నల్లగొండ, 30న వనపర్తి నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటుచేసినట్టుగా తెలిపారు.