పబ్లిక్ లిమిటెడ్‌లా మారిన టీజేఎస్

-పార్టీకి రాజీనామాచేసిన మహిళానేత జ్యోత్స్న -మహిళలకు భాగస్వామ్యం లేదని మండిపాటు -నేడు అందరి బండారం బయటపెడ్తానని ప్రకటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముందస్తు ఎన్నికల సందర్భంగా తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉనికిని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు. ఇదే సమయంలో మొదటినుంచి టీజేఎస్‌లో పనిచేస్తున్న మహిళా నేత జ్యోత్స్న ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ జనసమితిలో వ్యాపారం నడుస్తున్నదని, నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. టీజేఎస్‌ను నమ్ముకొని పనిచేస్తే ఎలాంటి ప్రయోజనమూ లేదని, అందుకే బయటికి వస్తున్నానని ప్రకటించారు. పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవం, భాగస్వామ్యం లేదని వాపోయారు. టీజేఎస్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థలా మారిందని, నేతలు మాటల్లో చెప్తున్న నీతి చేతల్లో కనిపించడంలేదని ధ్వజమెత్తారు. కోదండరాంను అడ్డంపెట్టుకొని దిలీప్‌కుమార్ సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారాలుసహా అన్ని విషయాలను సోమవారం మీడియా సమావేశంలో వెల్లడిస్తానని జ్యోత్స్న స్పష్టంచేశారు.