అమ్మకానికి టీజేఎస్ టికెట్లు

డబ్బు వసూళ్లకు దిలీప్‌కుమార్ టీమ్ టికెట్ అడిగితే కోట్లు డిమాండ్ చేస్తున్నారు కోదండరాం సర్.. దీనికోసమేనా పార్టీ పెట్టింది? అది ప్రత్యామ్నాయ పార్టీ కాదు.. వ్యాపార కేంద్రం మహిళలను అడ్డం పెట్టుకొని డబ్బు వసూళ్లు ప్రశ్నించినందుకు అసభ్యకర దూషణలు టీజేఎస్ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న సంచలన వ్యాఖ్యలు ఆధారాలతోసహా బండారం బయటపెడుతానని హెచ్చరిక
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ బండారం బట్టబయలయింది. పార్టీ ముసుగులో చేస్తున్న అక్రమాల గుట్టును ఆ పార్టీకి చెందిన మహిళా నేత ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న రట్టుచేశారు. టీజేఎస్‌లో పైసల దందాను సహించలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమెతోపాటు టీజేఎస్ కో కన్వీనర్ గడ్డం వెంకటేశ్ కూడా ఇదేబాటలో నడుస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన జ్యోత్స్న.. ప్రత్యామ్నాయ పార్టీ పేరుతో తెలంగాణ జనసమితి నేతలు చేస్తున్న అక్రమాల గురించి వివరించారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే సీట్లు అన్న విధంగా వ్యవహరిస్తున్నారని.. అంబర్‌పేట్ టికెట్ కావాలంటే సత్యంగౌడ్ ఇస్తున్న రూ.నాలుగు కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాలని తనను డిమాండ్‌చేశారని ఆరోపించారు. తనది బలమైన సామాజికవర్గం కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీలాగే టీజేఎస్ కూడా ఎమ్మెల్యే టికెట్ల పేరుతో వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు. కపిలవాయి దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం వసూళ్ల ప్రక్రియకు పాల్పడుతున్నట్లు చెప్పారు. పార్టీలో చాలామంది వసూల్ రాజాగాళ్లు ఉన్నారని ఆరోపించారు. పదవుల్లోగానీ, ప్రాధాన్యంలోగానీ మహిళలను లెక్కచేయని టీజేఎస్ నేతలు.. మహిళలను అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు మాత్రం పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రూపాయల దాకా కపిలవాయి దిలీప్‌కుమార్ తన వద్ద నుంచి తీసుకున్నారని, అడిగితే అది పార్టీ ఫండ్ అంటూ దబాయించారని ఆరోపించారు. ఎక్కడికెళ్లినా ఇన్నోవా కారు కొనిస్తారా..? లేదా బంగ్లా ఇస్తారా..? అంటూ టీజేఎస్ నేతలు సతాయిస్తున్నారని.. కండ్లల్లో నీళ్లతో రోజులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాలను రెండు మూడుసార్లు కోదండరాం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని చెప్పారు. కోదండరాం కనుసన్నల్లోనే ఈ తతంగం జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు.

కోదండరాం సర్.. దీని కోసమేనా పార్టీ పెట్టింది..?

లక్ష్యాల దిశగా పార్టీ నడువడం లేదు.. డబ్బు వసూళ్ల కోసమే పార్టీ నడుస్తున్నది.. ఉద్యమ ఆకాంక్ష అంటూ మోసం చేస్తున్నారు. టీజేఎస్ ప్రత్యామ్నాయ పార్టీ కాదు.. పక్కా బిజినెస్ సెంటర్.. కోదండరాం సర్.. దీనికోసమేనా మీరు పార్టీ పెట్టింది..? అని జ్యోత్స్న నిలదీశారు. ఇన్ని బాధలు భరిస్తూ తన అభిమానులను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఇష్టంలేకనే బయటికి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికలు రావటంతో ఇప్పుడు పొత్తుల నేపథ్యంలో మరో పైసల దందాకు తెరలేపారని, ఆధారాలన్నీ త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.

అసభ్యకరమైన మాటలు, బెదిరింపులు

పార్టీకి రాజీనామా చేసి వాస్తవాలు బయటపెట్టేందుకు వస్తే.. టీజేఎస్ నేతలు అసభ్యకరంగా మాట్లాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని జ్యోత్స్న ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం నుంచి దిలీప్‌కుమార్ అనుచరులు ఫోన్లుచేసి మీ సంగతి తేల్చుతామని హెచ్చరిస్తున్నారని.. సత్యం, విశాల్ అనే వ్యక్తులు తనకు, తన భర్తకు ఫోన్‌చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా దిలీప్‌కుమార్ ఫోన్‌చేసి భయపెడుతున్నారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో కృషిచేశానని, చివరకు తన పరిస్థితి ఇలా అయ్యిందన్నారు. టీజేఎస్ నేతల వల్ల తనకు, తన కుటుంబానికి ప్రమాదం ఉన్నదని చెప్పిన జ్యోత్స్న రక్షణ కోసం డీజీపీని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.