ట్రంప్ మునిగిపోతున్నారు.. చర్చనీయాంశమైన టైమ్ కవర్ పేజీ!

వాషింగ్టన్: టైమ్ మ్యాగజైన్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే తన కవర్‌పేజీపై ప్రచురించింది. ట్రంప్‌పై వరుసగా రెండోసారి కవర్ స్టోరీ రాయడం విశేషం. ఇంతకుముందు ఎడిషన్‌లో ట్రంప్, పుతిన్‌ల మార్ఫింగ్ ఫొటోలు వేసిన టైమ్.. ఈసారి ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మునిగిపోతున్నట్లుగా చిత్రీకరించింది. గతంలోనూ ట్రంప్ గురించి టైమ్ తన కవర్‌పేజీపై ఇలాంటి ఫొటోలనే ప్రచురించింది. ఆ రెండు కవర్ పేజీల్లో ఓవల్ ఆఫీస్‌లో కూర్చున్న ట్రంప్‌పై భారీ వర్షాలు కురుస్తున్నట్లు చిత్రీకరించారు. ట్రంప్‌ను చుట్టుముడుతున్న సమస్యల గురించి చెబుతూ ఆర్టిస్ట్ టిమ్ ఓబ్రైన్ ఈ కవర్‌పేజీ ఫొటోలను రూపొందించారు. ఇక అదే సిరీస్‌లో ఈ మూడో ఫొటో వేసిన ఓ బ్రైన్.. ఓవల్ ఆఫీస్ మొత్తం నీటితో నిండిపోయి అందులో ట్రంప్ తేలియాడుతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ట్రంప్‌కు సంబంధించి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ కవర్‌పేజీ ఉంది. సమస్యల్లో ట్రంప్ నిండా మునిగిపోయినట్లుగా చూపించారు. ట్రంప్ ప్రస్తుతం తన పదవిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌తో ఉన్న అఫైర్లను బయటపెట్టకుండా ఉండేందుకు ఆయన మాజీ లాయర్ మైకేల్ కోహెన్ ఓ పోర్న్ స్టార్, మరో మోడల్‌కు డబ్బులిచ్చినట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కోహెన్ కూడా మాన్‌హటన్ కోర్టులో అంగీకరించారు. దీని ఆధారంగా ట్రంప్‌ను అభిశంసించి, అధ్యక్ష పదవి నుంచి దింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే టైమ్ తన కవర్‌పేజీని ఇలా కళాత్మకంగా రూపొందించింది. టైమ్ మ్యాగజైన్ ట్రంప్‌ను గతేడాదిలోనే 15సార్లు తన కవర్‌పేజీపై ఉంచడం విశేషం. ట్రంప్ కవర్స్ అన్నీ కలిపి ఆ మ్యాగజైన్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

Related Stories: