నీటిపారుదలశాఖలో పదోన్నతుల జాబితా ఖరారు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైకోర్టు ఆదేశానుసారం తెలంగాణ నీటిపారుదలశాఖలో జోన్ 5, జోన్ 6లకు సంబంధించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగువ పోస్టులకు పదోన్నతుల జాబితాను ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ జల వనరులశాఖ కార్యదర్శి.. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖతోపాటు జాబితాను పంపించారు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి తెలంగాణకు చెందిన నీటిపారుదలశాఖలో ఈఈ, ఎస్‌ఈ, సీఈ, ఈఎన్సీలకు సంబంధించిన పదోన్నతుల జాబితాను రూపొందించారు. ఈ జాబితా మేరకు పదోన్నతులను అమలు చేయడంతోపాటు 2014 నుంచి ఇప్పటివరకు పదోన్నతుల ప్రక్రియను కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేయాల్సి ఉంది.