జమ్ము చెక్‌పోస్టుపై ఉగ్ర దాడి

- భద్రతా దళాల ఎదురు కాల్పులతో అడవిలోకి పరార్ - డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కోసం గాలింపు జమ్ము, సెప్టెంబర్ 12: ఆత్మాహుతి దళ సభ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు జైషే ఏ మహ్మద్ ఉగ్రవాదులు జమ్ము నగర శివారుల్లో ప్రధాన రహదారిపై ఝాజర్, నాగ్రోటా మధ్య ఒక చెక్‌పోస్టు వద్ద భద్రతా జవాన్లపై కాల్పులు జరిపి, అడవిలోకి పారిపోయారు. ఉగ్రవాదులు వస్తున్న ఒక ట్రక్కును తనిఖీ చేసేందుకు ప్రయత్నించడంతో జవాన్లపై వారు కాల్పులకు దిగారు. అనంతరం అడవిలోకి పారిపోయారు. దీంతో జమ్ము పరిసర ప్రాంతాల వాసులు ఆందోళనకు గురయ్యారు. అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టేందుకు డ్రోన్ విమానాలను ఉపయోగించారు. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, సైన్యం, భద్రతా సంస్థల జవాన్లు గాలింపు చేపట్టాయి. అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులు ఒక ఫారెస్ట్ గార్డ్‌పై కాల్పులు జరిపారు. కాగా, ఉగ్రవాదులు ప్రయాణించిన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బుధవారం తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు ఆవల నుంచి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు మూడు కి.మీ దూరంలోని చాక్ దయాళ వద్ద ఆ ట్రక్కులోకి ఎక్కారని పోలీసులు తెలిపారు. వారు ఆత్మాహుతి దాడి చేసేందుకే భారతదేశంలో చొరబడ్డారని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Related Stories: