సిద్ధార్థ్ వీరవిహారం

హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్.. ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్ pkl చెన్నై: కబడ్డీ బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ ఈ సీజన్‌లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 40-29తో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టైటాన్స్ ఎట్టకేలకు లీగ్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 18 పాయింట్లు ఖాతాలో ఉన్న టైటాన్స్ పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది. నలుపు దుస్తుల్లో బరిలో దిగిన మొదటి మ్యాచ్‌లోనూ గెలిచిన టైటాన్స్ మరోసారి బ్లాక్ డ్రెస్‌లో ఆడి ఆకట్టుకుంది. ప్రత్యర్థి కోర్టులో వీరవిహారం చేసిన సిద్ధార్థ్ (18 పాయింట్లు) టైటాన్స్‌ను ముందుండి నడిపించాడు. అతడికి సూరజ్ దేశాయ్ (6 పాయిం ట్లు) చక్కటి సహకారం అందించాడు. స్టీలర్స్ తరఫు వికాస్ కండోలా 9 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి రైడర్లు కూడా సత్తాచాటడంతో రైడింగ్‌లో ఇరు జట్లు దాదాపుగా సమానంగానే నిలిచినా.. ట్యాక్లింగ్‌లో టైటాన్స్ దుమ్మురేపడంతో అలవోకగా విజయం సాధించగలిగింది. తమిళ్ తలైవాస్, పుణెరీ పల్టన్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31-31తో డ్రాగా ముగిసింది.