ఆస్ట్రేలియా ఎన్నికల్లో తెలంగాణ యువకుడు

-పీట్రీ ఎంపీ స్థానానికి నిఖిల్‌రెడ్డి పోటీ -మద్దతు ప్రకటించిన తెలుగు, ఇండియా సంఘాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ యువకుడు ఐరెడ్డి నిఖిల్‌రెడ్డి (32) ఆస్ట్రేలియాలో ఎన్నికల బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగువారు అధికంగా ఉండే పీట్రీ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్నాడు. ఇందుకోసం అక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వన్‌నేషన్ పార్టీ తరపున బరిలోకి దిగిన నిఖిల్‌రెడ్డికి తెలుగు, తెలంగాణ సంఘాలతోపాటు పంజాబ్, గుజరాత్ తదితర రాష్ర్టాలకు చెం దిన ఎన్నారై సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిఖిల్‌రెడ్డి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట. ఆయన తండ్రి భూమిరెడ్డి హైదరాబాద్‌లో ఆలిండ్ సంస్థలో ఉద్యోగంచేసేవారు. దీంతో ఆయన కుటుంబం శేరిలింగంపల్లిలో స్థిరపడింది. తల్లి పుష్పలత గృహిణి. దోమలగూడ ఏవీ కాలేజీలో డిగ్రీ చదివిన నిఖిల్‌రెడ్డి 2007లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ అంచెలంచెలుగా ఎదిగి.. ఆస్ట్రేలియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన తనదైన ముద్రవేశారు. బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్‌ను స్థాపించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీస్ ఆఫ్ క్వీన్స్‌లాండ్ కార్యదర్శిగా సేవలందించారు. బ్రిస్బేన్‌లో నివసిస్తున్న నిఖిల్‌రెడ్డి.. సేవా కార్యక్రమాలోన్లూ పాల్గొంటున్నారు.

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లే స్ఫూర్తి..

తాను రాజకీయాల్లోకి రావడానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తి అని నిఖిల్‌రెడ్డి చెప్తున్నారు. ప్రజలతో మమేకం కావడం.. ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం పట్ల కేసీఆర్, కేటీఆర్‌లు చూపించే మొక్కవోని దీక్షకు ప్రజల్లో వస్తున్న స్పందన అమోఘమని, వారిని స్ఫూర్తిగా తీసుకుని.. అస్ట్రేలియా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నానని నిఖిల్‌రెడ్డి నమస్తే తెలంగాణకు వివరించారు.

గెలుస్తాడనే నమ్మకం ఉన్నది

పీట్రీ ఎంపీ స్థానానికి ముగ్గురు పోటీపడుతున్నారు. వీరిలో నిఖిల్‌రెడ్డి మాత్రమే ఎన్నారై. మన దేశానికి చెందిన సుమారు 15 వేల మంది ఎన్నారైలకు ఓటుహక్కు ఉన్నది. మరో 15 వేల మంది స్థానికుల మద్దతు సాధిస్తే.. గెలుపు నల్లేరుపై నడకే. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. మే 18వ తేదీన జరిగే పోలింగ్‌లో తెలంగాణ యువకుడు చరిత్ర సృష్టిస్తాడని భావిస్తున్నాం. -శ్రీకర్‌రెడ్డి అండెం, బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్

Related Stories: