తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ‌కు మ‌రో అవార్డు

హైద‌రాబాద్: తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ‌కు మ‌రో అవార్డు ద‌క్కింది. రూర్బ‌న్ ప‌థ‌కాన్ని స‌మ‌ర్థవంతంగా అమ‌లు చేస్తూ దేశంలోనే ముందంజ‌లో ఉన్న తెలంగాణను ఈ పుర‌స్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం జ‌రుగ‌నుంది. గ్రామాల్లో ప‌ట్ట‌ణ వ‌స‌తులు క‌ల్పించే ల‌క్ష్యంతో శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ రూర్బ‌న్ మిష‌న్ ప‌థ‌కం కింద కేంద్రం అంద‌జేస్తున్న ఆర్థిక సాయాన్ని పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసుకున్న ఉత్త‌మ రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. ఈ అవార్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చేతుల మీదుగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్‌ ఆశా అందుకోనున్నారు. మూడు విడుత‌లుగా మంజూరైన నిధుల‌తో రాష్ట్రంలోని 16 క్ల‌స్ట‌ర్ల‌లోనూ రూర్బ‌న్ ప‌థ‌కాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తూ కేంద్ర ప్ర‌భుత్వ‌ అవార్డును పొందిన అధికారుల‌ను పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అభినందించారు. ఇదే స్పూర్తితో రానున్న‌ ఏడాది కాలంలోనూ రూర్బ‌న్ అమ‌లు చేస్తున్న అన్ని గ్రామాల్లోనూ ప‌ట్ట‌ణ వ‌స‌తులు స‌మ‌కూర్చేందుకు ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ముందుకు పోవాల‌ని సూచించారు. 
× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి