ఏలియన్స్ వచ్చి వెళ్లారట.. మనకు తెలియలేదు!

హూస్టన్: భూమిపై కాకుండా ఈ అనంత విశ్వంలో ఎక్కడైనా జీవరాశి ఉందా.. ఇది ఇప్పటికీ అంతుబట్టని విషయం. ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు. ఏలియన్స్ ఉన్నారా లేరా అన్నది మాత్రం తేల్చలేకపోయారు. కొంతమంది ఏలియన్స్ ఉన్నారని, వాళ్లు మనకు తెలియకుండా మన మధ్యే ఉన్నారనీ చెప్పినా.. దానికి ఆధారాలు మాత్రం చూపలేదు. అయితే తాజాగా ఓ నాసా సైంటిస్టు కూడా ఏలియన్లు ఉన్నారని, వాళ్లు వచ్చి వెళ్లిన విషయం కూడా మనకు తెలియదని చెప్పడం విశేషం. సిల్వానో పీ.కొలంబానో అనే నాసా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ డివిజన్ సైంటిస్టు ఏలియన్స్ గురించి తన తాజా ఆర్టికల్‌లో చెప్పడం ఆసక్తి రేపుతున్నది. ఏలియన్లు మనం అనుకుంటున్నట్లు ఉండరని, వాళ్లు సుదీర్ఘ దూరాలు ప్రయత్నిస్తారని, మన దగ్గరికి కూడా వచ్చి వెళ్లిన విషయం మనకు తెలియదని ఆ సైంటిస్టు చెప్పాడు.

మనం ఊహించుకుంటున్న స్థాయిలో మనిషి టెక్నాలజీలో వృద్ధి సాధించలేదని, అందుకే గ్రహాంతరవాసుల విషయంలో మనం అనుకుంటున్న సిద్ధాంతాలు తప్పు కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మన మానవ నాగరికత కేవలం పది వేల ఏళ్ల కిందటే మొదలైంది. ఇక శాస్త్రీయ పద్ధతుల వృద్ధి 500 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. అందువల్ల సాంకేతికంగా మనం ఎంతో ముందున్నాం అనుకోవడం తప్పని కొలంబానో స్పష్టం చేశారు. ఏలియన్స్ వచ్చిన వెళ్లిన విషయాన్ని మరింత సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని సహచర శాస్త్రవేత్తలను కోరిన కొలంబానో.. అన్ని యూఎఫ్‌ఓ సిద్ధాంతాల గురించి వివరించడం లేదా ఖండించలేమని చెప్పారు. నాసాకు చెందిన సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరస్ట్రియల్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన డీకోడింగ్ ఏలియన్ ఇంటెలిజెన్స్ అనే వర్క్‌షాప్‌లో తొలిసారిగా కొలంబానో తన అభిప్రాయాలను వెల్లడించారు.

Related Stories: