మధురమీ విజయం

India చరిత్ర తెలియనిదే భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేం..గతాన్ని గుర్తిస్తేనే వర్తమానానికి మెరుగులు దిద్దగలం.మూడు పుష్కరాల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అనామక జట్టుగా అడుగుపెట్టిన భారత్.. మహామహా టీమ్‌లను మట్టికరిపించి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. అప్పటిదాక పెద్దగా గుర్తింపులేని టీమ్‌ఇండియా సంచలన ఆటతీరుతో ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి.. అందరిని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ భారత క్రీడా చరిత్రలో నూతనధ్యాయాన్ని లిఖించింది. అప్పటి వరకు హాకీ జోరులో తేలియాడుతున్న భారతావనిని క్రికెట్ వైపు మళ్లించిన ఆ విజయాన్ని మరోసారి నెమరువేసుకుంటే.. ఇప్పుడంటే వరల్డ్‌కప్ అనే పేరు పక్కా అయిపోయింది కానీ ప్రపంచకప్ ప్రారంభంలో ఏ సంస్థ స్పాన్సర్ చేస్తే ఆ పేరుతోనే పిలిచేవారు. అలా 1983 టోర్నీకి ప్రుడెన్షియల్ కప్‌గా పేరుపడింది. అప్పటికి రెండు దఫాలు ఈ టోర్నీ జరిగితే రెండింట్లోనూ విండీస్ జయకేతనం ఎగురవేసింది. అదే ఊపులో హ్యాట్రిక్ కొట్టాలని ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ బిలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, జింబాబ్వేతో కలిసి భారత్ బరిలో నిలిచింది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో రెండేసి సార్లు తలపడాల్సి రావడంతో విండీస్, ఆసీస్‌తో పోటీ పడి భారత్ సెమీస్ చేరడం కలే అనిపించింది. అయితే టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌కు షాకిచ్చిన భారత్.. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఆస్ట్రేలియాపై ఓ మ్యాచ్ నెగ్గి ఒకటి ఓడింది. విండీస్‌తో మరో మ్యాచ్‌లోనూ ఓడింది. అయినా 4 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని సెమీస్‌కు అర్హత సాధించింది.

సెమీస్ సాగిందిలా

సొంతగడ్డపై టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లు గ్రేమ్ ఫాలర్ (33), క్రిస్ టవారే (32) మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆఖరుకు ఇంగ్లండ్ 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కపిల్ దేవ్ 3 వికెట్లు పడగొడితే.. రోజర్ బిన్నీ, మొహిందర్ అమర్‌నాథ్ చెరో 2 వికెట్లు తీశారు. 214 పరుగుల లక్ష్యం ఏమంత గొప్పదిగా అనిపించకపోయినా.. ఇంగ్లిష్ బౌలర్లను ఎదుర్కొంటు మనవాళ్లు అంత స్కోరు చేయగలరా అనే అనుమానాలు.. దానికి తగ్గట్లే 50 పరుగులకే ఓపెనర్లు సునీల్ గవాస్కర్ (25), కృష్ణమాచారి శ్రీకాంత్ (19) పెవిలియన్ చేరారు. మరో రెండు వికెట్లు పడితే భారత్ ఖేల్ ఖతం. కానీ ఆ సమయంలో మొహిందర్ అమర్‌నాథ్ (46) యశ్‌పాల్ శర్మ (61) మొండిగా పోరాడారు. ఓ వైపు ఫాస్ట్ బౌలర్లను కాచుకుంటూనే సింగిల్స్, డబుల్స్ ద్వారా ఒక్కో పరుగు జోడించుకుంటూ వెళ్లారు. India1 లక్ష్యం కొద్దికొద్దిగా కరుగుతూ వెళ్తున్న క్రమంలో అమర్‌నాథ్ ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చన సందీప్ శర్మ (51) రెచ్చిపోయాడు. ఎడాపెడా ఫోర్లు కొడుతూ లక్ష్యాన్ని మరింత చిన్నది చేశాడు. 36 ఏండ్ల క్రితం 30 బంతుల్లో అర్ధసెంచరీ చేయడమంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. విజయానికి 9 పరుగుల దూరంలో యశ్‌పాల్ ఔటైనా.. కపిల్‌తో కలిసి పాటిల్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు. మరో సెమీస్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్లతో ఓడించిన విండీస్ వరుసగా మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ఫైనల్ ఫైట్

పెద్ద మ్యాచ్‌లు ఆడిన అనుభవం బొత్తిగా లేని భారత్ ఓ వైపు. అప్పటికే క్రికెట్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న విండీస్ మరోవైపు. భారత్ గెలుస్తుందనే మాట అటు పక్కనుంచి కరీబియన్లకు కనీసం పోటినిస్తుందనే నమ్మకం కూడా ఎవరికీ లేదు. టాస్ గెలిచిన విండీస్.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ గవాస్కర్ (2) ఆరంభంలోనే ఔటయ్యాడు. శ్రీకాంత్ (38), అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) కాస్త పోరాడినా.. భీకరమైన కరీబియన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో భారత్ 183 పరుగులకు ఆలౌటైంది. ఇంకేముంది వెస్టిండీస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కెప్టెన్ కపిల్ మాత్రం మిత్రులారా ఇది గెలిచే స్కోరు కాకపోయినా.. కచ్చితంగా పోరాడే స్కోరేఅని టీమ్ సభ్యుల్లో స్ఫూర్తి రగిల్చాడు. అందుకు తగ్గట్లే ఓపెనర్ గార్డెన్ గ్రీనిడ్జ్ (1)ను భారత్ త్వరగానే ఔట్‌చేసింది. కానీ టార్గెట్ మొత్తాన్ని ఒంటిచేత్తో బాదేయగల ఆల్‌టైమ్ గ్రేట్ వివ్ రిచర్డ్స్ క్రీజులో ఉన్నాడు. అంచనాలకు తగ్గట్లే విండీస్ అలవోకగా లక్ష్యం దిశగా అడుగులు ముందుకేసింది. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. మదన్‌లాల్ బౌలింగ్‌లో రిచర్డ్స్ భారీషాట్‌కు యత్నించాడు. కానీ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి మిడ్‌వికెట్ ప్రాంతంలో గాల్లోకి లేచింది. ఆ సమయంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపిల్ సుమారు 20 గజాలు వెనక్కి పరిగెడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అంతే అక్కడి నుంచి కథ మారింది. మదన్‌లాల్‌కు తోడు అమర్‌నాథ్ బంతితో విజృంభించడంతో చివరకు విండీస్ 140 పరుగులకే పరిమితమైంది. కప్పు కపిల్ సేన సొంతమైంది. 2 ఈ టోర్నీలో వెస్టిండీస్ ఓడిన రెండు మ్యాచ్‌లూ ఇండియా చేతిలోనే కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో భారత్ చేతి లో 34 పరుగులతో ఓడిన విండీస్.. ఫైనల్లో 43 పరుగులతో పరాజయం పాలైంది

భారత్ విజయ ప్రస్థానం

1. విండీస్‌పై 34 పరుగుల తేడాతో గెలుపు 2. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో విజయం 3. ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగులతో ఓటమి 4. వెస్టిండీస్ చేతిలో 66 పరుగుల తేడాతో పరాజయం 5. జింబాబ్వేపై 31 పరుగులతో గెలుపు 6. ఆస్ట్రేలియాపై 118 పరుగులతో విజయం సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లతో ఘనవిజయం ఫైనల్లో వెస్టిండీస్‌పై 43 పరుగుల తో జయభేరి.

ఆ ఇన్నింగ్స్ అజరామరం

లీగ్ దశలో భారత కెప్టెన్, హర్యానా హారికేన్ కపిల్‌దేవ్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జింబాబ్వేపై అప్పటికే ఓ మ్యాచ్ గెలిచి జోరు మీదున్న భారత్ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అంచనాలకు అందని రీతిలో జింబాబ్వే పేసర్లు విజృంభించడంతో మన బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు గవాస్కర్, శ్రీకాంత్ సున్నా చుట్టారు. అమర్‌నాథ్, సందీప్ పాటిల్ కూడా విఫలమయ్యారు. దీంతో 9/4తో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 24 ఏండ్ల కపిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి కాసేపటికే యశ్‌పాల్ కూడా ఔటవడంతో 17 పరుగులకే సగం టీమ్ పెవిలియన్ చేరింది. అక్కడి నుంచి జట్టును గట్టెక్కించే బాధ్యతను భూజానెత్తుకున్న కపిల్ ఒక్కో పరుగు చేసుకుంటూ వెళ్లాడు. రోజర్ బిన్నీతో కలిసి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇక ఫర్వాలేదనిపిస్తున్న సమయంలో మళ్లీ దెబ్బ పడింది. పరుగు తేడాతో బిన్నీ, రవిశాస్త్రి పెవిలియన్ చేరారు. మరో ఎండ్‌లో మదన్ లాల్‌ను నిల్చోబెట్టి ఎడాపెడా బాదుతూ వెళ్లిన కపిల్ జట్టు స్కోరును 140కి చేర్చాడు. ఇక్కడ మరోదెబ్బ మదన్‌లాల్ కూడా ఔటయ్యాడు. ఇక మిగిలింది కీపర్ కిర్మాణీ దీంతో ఏదో ఒకటి చేయకపోతే మ్యాచ్ చేజారే అవకాశం ఉందని భావించిన కపిల్ ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కపిల్ ఆ తర్వాత కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మ్యాచ్ ముగిసేసరికి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. అప్పటికి వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఫలితంగా భారత్ 266/8తో నిలిచింది. అనంతరం బౌలింగ్‌లో మదన్‌లాల్, బిన్నీ చెలరేగడంతో జింబాబ్వే 235 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఆ తర్వాత విండీస్‌ను ఓడించిన కపిల్ డెవిల్స్ విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు పవర్ హిట్టింగ్‌లో పడి అంతా మరిచిపోయారు కానీ.. ఆ రోజు కపిల్ ఆడిన ఇన్నింగ్స్ ఏ ట్రిపుల్ సెంచరీకి తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు.