రవీంద్ర భారతిలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

హైదరాబాద్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా 154 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రంతో పాటు, నగదు బహుమతిని మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి మన విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్ విద్యను పటిష్టపరిచామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 611 గురుకుల విద్యాసంస్థలను నెలకొల్పామని కడియం పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 శాతానికి పెరిగిందని కడియం తెలిపారు. ఫలితాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. ఒప్పంద ఉపాధ్యాయ, అధ్యాపకుల జీతాలను పెంచాలనే యోచనలో ఉన్నామన్నారు. కేజీబీలను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు పొడిగిస్తున్నామని కడియం తెలిపారు. ఉపాధ్యాయులు నిబద్దతతో పని చేయాలి. విద్యార్థులకు మంచి విద్య అందిస్తే మంచి సమాజం నిర్మాణమవుతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
× RELATED ఎన్టీఆర్‌లో స‌మంత ఏ పాత్ర పోషిస్తుందో తెలుసా ?