టీచర్ బదిలీ అయ్యాడని.. విద్యార్థులు ఏడ్చేశారు.. వీడియో

చెన్నై : విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సదరు విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోరు. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు, ఉత్తమమైన ఉద్యోగాలు సాధించినప్పుడు.. తమ జీవితంలో కీలకమైన గురువులను విద్యార్థులు నెమరేసుకుంటారు. నాడు ఆ గురువు లేకపోతే నేడు ఇలా ఉండేవాళ్లం కాదని పదిమందికి తమ జీవిత సత్యాన్ని చెబుతుంటారు ఉత్తమమైన విద్యార్థులు. గురువులకు, విద్యార్థులకు విడదీయరాని బంధం ఉంటుంది. నాలుగేండ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువు బదిలీ అవుతున్నాడంటే.. సదరు విద్యార్థులు కంటతడి పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనే తమిళనాడులోని వ్లైగారంలో ఇటీవలే చోటు చేసుకుంది. వ్లైగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జి భగవాన్(28) అనే వ్యక్తి ఇంగ్లీష్ టీచర్‌గా నాలుగేండ్ల నుంచి పని చేస్తున్నాడు. భగవాన్ సార్.. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తున్నాడు. అయితే ఆయన ఇటీవలే వేరే పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తమకు చక్కటి ఇంగ్లీష్ బోధించిన భగవాన్ సార్ బదిలీ అయి పోతున్నాడని తెలుసుకున్న విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చి వీడ్కోలు చెప్పబోయిన భగవాన్ సార్‌ను పిల్లలు చుట్టుముట్టారు. మీరు ఎక్కడికి వెళ్లొద్దు. మీ వల్లే ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాం. మీరు ఇక్కడే ఉండాలని విద్యార్థులందరూ బోరున విలపించారు. ఆయనను గట్టిగా హగ్ చేసుకుని బాధ పడ్డారు. విద్యార్థులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుడు ఇక్కడే ఉండాలని డిమాండ్ చేశారు. గట్టిగా ఏడ్చేశారు : భగవాన్ ఈ సంఘటనపై ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు జి. భగవాన్ స్పందించారు. బుధవారం ఉదయం తన గదికి చేరుకోగానే విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. మొదట తన స్కూటర్ కీని తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాగ్‌ను లాగేసుకున్నారు. ఇక గట్టిగా అరుస్తూ ఏడ్చేశారు. క్లాస్‌రూంలోకి తీసుకెళ్లి.. మీరు ఎక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి అని విద్యార్థులు ప్రాధేయపడ్డారని భగవాన్ తెలిపాడు. తనకు జీతం ముఖ్యం కాదు.. పిల్లలతో ఉన్న అనుబంధం ముఖ్యమని ఉపాధ్యాయుడు చెప్పాడు.
× RELATED మృతుడి కుటుంబానికి రూ. 3లక్షలు ఎక్స్‌గ్రేషియా