స్వలింగ వివాహాలకు తైవాన్ ఆమోదం

-సంబరాలు చేసుకున్న ఎల్జీబీటీలు తైపీ, మే 17: స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి తైవాన్ అనుమతినిచ్చింది. ఆసియాలోనే ఇలా అనుమతినిచ్చిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆ దేశ పార్లమెంట్ శుక్రవారం ఆమోదించింది. దీంతో ఆ దేశంలో ఇకపై ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు పెండ్లి చేసుకోవచ్చు. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి అనుమతించాలని, వీరి వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరుతూ గత కొంతకాలంగా తైవాన్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల పెండ్లిళ్లకు సంబంధించి మార్పులు చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకుగాను ఈ నెల 24ను గడువుగా విధించింది. గడువు దగ్గరపడుతుండటంతో శుక్రవారం పార్లమెంట్ బిల్లును ఆమోదించింది. మరోవైపు బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలో స్వలింగ సంపర్కులు భారీ సంఖ్యలో పార్లమెంట్ బయట గుమికూడారు. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించాలంటూ నినాదాలు చేశారు. బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిన వెంటనే సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతినిచ్చాయి.