విరామం తీసుకోవాల్సిందే!

ఏ కథానాయికైనా గ్లామర్ తళుకులతో కొంతకాలమే అలరిస్తుంది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలంటే అభినయ ప్రధాన పాత్రలపై దృష్టిపెట్టాల్సిందే. ఢిల్లీ సొగసరి తాప్సీ కెరీర్‌ను పరిశీలిస్తే ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. దక్షిణాదిలో ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమై ఈ సొగసరి బాలీవుడ్ సెకండ్ ఇన్సింగ్స్‌లో తన పంథా మార్చుకుంది. పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలపై దృష్టిసారించింది. పింక్ చిత్రం ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇటీవల విడుదలైన ముల్క్ సినిమాలో తాప్సీ అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ నా అభిరుచులకు అనుగుణంగా గొప్ప జీవితాన్ని ఆస్వాదించాలన్నదే నేను నమ్మే సిద్ధాంతం. డబ్బు, పేరుప్రఖ్యాతుల కోసం ఇండస్ట్రీకి రాలేదు. సినిమాల్లోకి ప్రవేశించే ముందు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగాన్ని కాదనుకున్నాను. నా ప్రతిభాపాటవాల్ని నిరూపించుకోవడానికి సినిమారంగాన్ని వేదికగా ఎంచుకున్నాను. నేను అనుకున్నది చాలా వరకు సాధించాననే సంతృప్తి ఉంది. అయితే ఈ విజయాలన్నీ శాశ్వతం కావని తెలుసు. ఎప్పుడో ఈ ప్రయాణానికి విరామం ప్రకటించాల్సిన సమయం వస్తుంది. అందుకు నేను సిధ్ధంగా ఉన్నాను. అందుకే ప్రతి పాత్రను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా ఖాతాలో మరిన్ని మంచి సినిమాలు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను అని చెప్పింది.