స్విట్జర్లాండ్‌లో అతిలోక సుందరి విగ్రహం!

బెర్న్: అతిలోక సుందరి శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నది స్విట్జర్లాండ్. సినిమాల ద్వారా తమ దేశాన్ని ప్రమోట్ చేసిన బాలీవుడ్ స్టార్ల విగ్రహాలను స్విస్ ఆవిష్కరిస్తున్నది. 2016లో ఇలాగే యష్ చోప్రా విగ్రహాన్ని కూడా ఇంటర్‌లేకెన్‌లో ఏర్పాటు చేశారు. చోప్రా నిర్మించిన చాలా సినిమాలు స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించారు. ఇది భారతీయ టూరిస్టులలో స్విస్ పట్ల ఆకర్షణను పెంచింది. అలాగే శ్రీదేవి కూడా ఇక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేశారు. 1989 బ్లాక్‌బస్టర్ మూవీ చాందినీ సినిమా పాటలు చాలా వరకు ఇక్కడే చిత్రీకరించారు. అందుకే ఆమె గౌరవార్థం శ్రీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నాం అని స్విస్ సీనియర్ అధికారి వెల్లడించారు.

1964లో రాజ్‌కపూర్ సంగమ్ మూవీని తొలిసారి స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత 1967లో యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్ షూట్ చేశారు. అప్పటి నుంచీ బాలీవుడ్‌లో చాలా సినిమాలకు స్విట్జర్లాండ్ ఓ గమ్యస్థానంగా మారిపోయింది. ఇది చూసి భారతీయ టూరిస్టులు స్విస్‌కు క్యూ కట్టారు. 1995లో యశ్ చోప్రానే నిర్మించిన దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగె సినిమాతో స్విట్జర్లాండ్‌పై ఇండియన్ టూరిస్టుల్లో ఎక్కడలేని మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్టులకు బాలీవుడ్ ప్యాకేజ్డ్ టూర్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. 2011లో ఇంటర్‌లేకెన్ ప్రభుత్వం యశ్ చోప్రాను అంబాసిడర్‌గా ప్రకటించడంతోపాటు ఓ రైలుకు ఆయన పేరును పెట్టింది.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు