కావడియాల వీరంగంపై సుప్రీంకోర్టు సీరియస్

భక్తిపేర కాషాయం కట్టి పుణ్యతీర్థాల యాత్రకు వెళ్లే కావడియాల హింసాకాండపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ఆగిపోవాల్సిందేనని సర్కారుకు స్పష్టంచేసింది. దొమ్మీకి దిగడం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి శ్రుతిమించిపోతున్నాయని మండిపడింది. హింసాత్మక నిరసనలపై కేసు విచారణ సందర్భంగా ఇటీవల కావడియాలు రోడ్ల మీద రెచ్చిపోవడం గురించిన ప్రస్తావన వచ్చింది. ఓవైపు మరాఠా, ఎస్సీఎస్టీ ఆందోళనలు హింసాతమకంగా పరిణమించడం.. మరోవైపు కావడియాలు వీధుల్లో వీరంగం వేయడం గురించి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్పందిస్తూ మీ ఇల్లు కావాలంటే తగులబెట్టుకోండి.. హీరోలుగా భావించుకోండి.. కానీ ఇతరుల ఆస్తులను పాడుచేసే హక్కు మీకెక్కడిది? అని హింసావాదులను హెచ్చరించారు. అలహాబాద్‌లో కావడియాలు సగం హైవేను ఆక్రమించుకున్నారని న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. పద్మావత్ సినిమాపై రాజ్‌పుత్‌ల ఆందోళన సందర్భంగా కొండుగల్లూరులో ఫిల్మ్‌క్లబ్ ఆస్తులపై నిరసనకారుల దాడికి సంబంధించి దాఖలైన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కావడియాలు తమను రాసుకుంటూ వెల్లిందని ఓ కారుపై ప్రతాపం చూపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అందులో ప్రయాణిస్తున్న జంట భయంతో కిందకు దిగి చూస్తుండగానే కావడియాలు కారును తుక్కుతుక్కు చేశారు. పోలీసులు కూడా వారిని ఆపలేకపోయారు.

× RELATED ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో..