సుప్రీంకోర్టు మాది.. మందిరం కట్టి తీరుతాం!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మరో మంత్రి రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాది.. అందుకే అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరతాం అని యూపీ సహకార మంత్రి ముకుట్ బిహారీ వర్మ అన్నారు. బీజేపీ అభివృద్ధి ఎజెండాను చూపించే అధికారంలోకి వచ్చినా.. రామ మందిరం నిర్మించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ సుప్రీంకోర్టు ఎలాగూ మాదే. న్యాయవ్యవస్థ, పాలన వ్యవస్థ, దేశం, రామ మందిరం.. అన్నీ మావే అని ముకుట్ వర్మ స్పష్టంచేశారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య కూడా గతంలో అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అవసరమైతే మందిర నిర్మాణానికి చట్టం తీసుకొస్తామని ఆయన అన్నారు. కోర్టులో చాలా రోజులు ఈ విషయం పెండింగ్‌లో పెట్టొద్దు. లేదంటే దీనిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటా లేదా పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తాం అని కేశవ్ ప్రసాద్ మౌర్య అనడం వివాదాస్పదమైంది.

× RELATED మరో అరుదైన రికార్డు చేరువలో ధోనీ