మేం మనుషులను తినే పులులం కాదు

-రాష్ట్ర ప్రభుత్వాలు భయపడనవసరం లేదు -ఏపీలో అక్రమ మైనింగ్‌పై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఏదైనా కేసు విచారణ పెండింగ్‌లో ఉంటే రాష్ట్రప్రభుత్వాలు ఆందోళన చెందనవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానమేమీ మనుషులను తినే పులి కాదని వ్యాఖ్యానించింది. మేం పులో, మరొకటో కాదు. మేం మనుషులను తినే పులులం కాదు. వారు (రాష్ట్ర ప్రభుత్వాలు) ఆందోళన చెందనవసరం లేదు అని జస్టిస్‌లు మదన్ బీ లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ట్రైమెక్స్ గ్రూప్ నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీనియర్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రైమెక్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వ్యతిరేకించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని ఆరోపిస్తూ తమ లైసెన్సును రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పిటిషన్ దాఖలైందని ఆయన అన్నారు. రోహత్గీ వ్యాఖ్యలపై న్యాయస్థానం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. కాగా, శర్మ తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. రాష్ట్రప్రభుత్వం సదరు కంపెనీ లైసెన్సును తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసిందని, అసలు ఆ సంస్థ లైసెన్సును రద్దు చేయాలన్నారు. పిటిషనర్ వాదనను వ్యతిరేకించిన రోహత్గీ.. ఇది అక్రమ మైనింగ్ కాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఒకరిద్దరు వ్యక్తుల ఒత్తిళ్ల వల్ల ఒక రాష్ట్రప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని భావించలేం అని వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Related Stories: