వాట్సాప్ ద్వారా విచారణ జరుపుతారా.. తమాషాగా ఉందా?

న్యూఢిల్లీ: ఇప్పుడు ఇండియాలో అన్నింటికీ వాట్సాప్‌నే వాడుతున్నారు. అలాగే జార్ఖండ్‌లోని ఓ కోర్టు కూడా ఇద్దరు రాజకీయ నేతలపై అభియోగాలను వాట్సాప్ కాల్ ద్వారా మోపింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వాట్సాప్ ద్వారా తీర్పు ఎలా చెబుతారు.. తమాషాగా ఉందా అంటూ జార్ఖండ్ ట్రయల్ కోర్టుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదో పెద్ద జోక్.. ఇలాంటిది భారత న్యాయవ్యవస్థలో ఎలా జరిగింది అని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, ఎల్‌ఎన్ రావ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించారు. జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సావో, ఆయన భార్య, ఎమ్మెల్యే నిర్మలా దేవిలపై 2016లో జరిగిన అల్లర్లకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో గతేడాది డిసెంబర్‌లోనే వీళ్లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే భోపాల్‌లోనే ఉండాలని, జార్ఖండ్‌లో కోర్టు విచారణకు తప్ప ఎప్పుడూ వెళ్లకూడదని నిబంధనలు విధించింది.

దీంతో జార్ఖండ్‌లోని ట్రయల్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు జరుపుతుండేది. అయితే ఏప్రిల్ 19న మాత్రం అటు భోపాల్‌లో, ఇటు జార్ఖండ్‌లోని హజారీబాగ్ కోర్టులో నెట్‌వర్క్ సరిగా లేకపోవడం వల్ల వీడియో కాన్ఫరెన్స్ కుదరలేదు. దీంతో అక్కడి కోర్టు వాట్సాప్ కాల్ ద్వారా ఆ ఇద్దరిపై పలు అభియోగాలను నమోదు చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆ దంపతులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జార్ఖండ్‌లో అసలు ఏం జరుగుతున్నది. ఇలాంటి ప్రక్రియను అనుమతించకూడదు. న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చే చర్యలివి. వాట్సాప్ ద్వారానే విచారణ మొత్తం జరిపే పరిస్థితి కూడా వస్తుంది. అలా జరగకూడదు. ఇదేం విచారణ.. ఇదేమన్నా జోక్ అనుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

× RELATED నారాయ‌ణ‌పేట్‌లో ఆధిపత్య పోరు..!