సూపర్ హిట్లు మిస్సయ్యారు

చిత్రసీమలో విజయాలు దోబూచులాడుతుంటాయి. కొన్నిసార్లు మంచి అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. అలా కొంతమందికి చేజారిన సినిమాలు మరికొందరికి అదృష్టంగా మారుతుంటాయి. సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు సినీరంగంలో నాయకానాయికల కెరీర్‌ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వారి భవితవ్యాన్ని మారుస్తాయి. ఒకరు చేయాల్సిన సినిమా అవకాశాలు మరొకరికి దక్కడం అనేది చిత్రసీమలో పరిపాటే. అయితే కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలు కొందరికి ఖేదాన్ని మిగిలిస్తే మరికొందరికి సంతోషాల్ని పంచుతాయి. ఇటీవల కాలంలో విజయవంతమైన సినిమాలు చేజార్చుకున్న కొందరు నాయకానాయికలు ఉన్నారు.

తమిళ చిత్రం చెక్క చివంతవానం(తెలుగులో నవాబ్)తో పూర్వవైభవాన్ని దక్కించుకున్నారు విలక్షణ దర్శకుడు మణిరత్నం. అరవిందస్వామి, శింబు, అరుణ్‌విజయ్, జ్యోతిక ప్రధాన పాత్రధారులుగా మల్టీస్టారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నది. తొలుత ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ స్టార్స్‌తో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించాలని మణిరత్నం భావించారు. తెలుగు వెర్షన్ కోసం ముగ్గురు హీరోల్లో ఓ పాత్ర కోసం రామ్‌చరణ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. కానీ ప్రతినాయక ఛాయలతో సాగే పాత్ర కావడంతో రామ్‌చరణ్ ఈ సినిమాను తిరస్కరించినట్లు సమాచారం. నానికి సైతం మణిరత్నం ఈ కథను వినిపించారు. కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నాని ఈ సినిమా తిరస్కరించినట్లు తెలిసింది. ద్విభాషా సినిమా వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమాను తెలుగులో అనువాద రూపంలో విడుదలచేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.

గీత పాత్ర కోసం..

sruthihassan.jpg విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న జంటగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీతగోవిందం చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించింది. కుటుంబ బంధాలకు వినోదం, ప్రేమకథను మిళితం చేసి రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నల కెమిస్ట్రీ అందరిని అలరించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్ర కోసం తొలుత లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. ఆమెపై ఫొటోషూట్‌తో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది.

అనివార్య కారణాల వల్ల అర్ధాంతరంగా ఆమె తప్పుకోవడంతో రష్మికకు ఈ అవకాశం దక్కింది. దాంతో లావణ్య ఖాతా నుంచి ఓ పెద్ద హిట్ మిస్ అయ్యింది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన డిటెక్టివ్ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఓ నరహంతక ముఠాను తన తెలివితేటలతో పట్టుకునే అద్వైతభూషణ్ అనే డిటెక్టివ్ కథతో ఉత్కంఠభరితంగా దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాను మలిచారు. ఇందులో అభినయానికి ఆస్కారమున్న ఓ డీగ్లామర్ రోల్‌లో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అయితే తొలుత ఈ పాత్ర కోసం రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంచుకున్నారు. కానీ కథలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే ఆలోచనతో రకుల్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఆమె స్థానంలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన తొలిప్రేమ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. ముఖ్యంగా రాశీఖన్నా నటనకు చక్కటి పేరు వచ్చింది. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలకు ఆమె న్యాయం చేయగలదని ఈ చిత్రం నిరూపించింది. ఈ సినిమాలో కథానాయికగా మెహరీన్ నటించాల్సింది. కానీ అదే సమయంలో ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాక వదులుకుంది. దాంతో రాశీఖన్నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ సినిమాతో కెరీర్‌లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది రాశీఖన్నా.

అర్జున్‌రెడ్డి గా మరొకరు..

sai-pallavi.jpg తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది అర్జున్‌రెడ్డి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కల్ట్ మూవీగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దృష్టిని ఆకర్షించింది. ధిక్కార స్వభావుడు, కోపిష్టి యువకుడిగా విజయ్‌దేవరకొండ అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ, తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను తొలుత శర్వానంద్‌తో చేయాలని భావించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆయనకు కథను వినిపించారు. కానీ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ప్రయోగాలు చేయడానికి సాహసం చేయలేదు శర్వానంద్. అలా ఈ సినిమాలోకి శర్వానంద్ స్థానంలో విజయ్ దేవరకొండ వచ్చిచేరారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్‌హీరోగా మారిపోయారు. అలాగే ఇటీవల చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన lavanya-tripathi.jpg ఆర్‌ఎక్స్ 100 సినిమాను తొలుత విజయ్‌దేవరకొండతో చేయాలని భావించారు దర్శకుడు అజయ్‌భూపతి. ఆయనకు కథ వినిపించారు. కానీ అర్జున్‌రెడ్డి ఛాయలతో ఈ కథ సాగడంతో విజయ్ ఈ సినిమాను తిరస్కరించినట్లు తెలిసింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకొని తెలుగు చిత్రసీమఖ్యాతిని చాటిన చిత్రం శతమానంభవతి. దిల్‌రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను రాజ్‌తరుణ్‌తో చేయాలని చిత్రబృందం భావించారు. అతడితో ఈ సినిమా చేస్తున్నట్లు దిల్‌రాజు స్వయంగా ప్రకటించారు. కానీ సెట్స్‌పైకి వచ్చే సమయానికి రాజ్‌తరుణ్ స్థానంలో శర్వానంద్ హీరోగా వచ్చారు.

నాగార్జున, కార్తీ కథానాయకులుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి సినిమాలో తొలుత హీరోయిన్‌గా శృతిహాసన్ నటించాల్సింది. అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో తమన్నాను హీరోయిన్‌గా తీసుకున్నారు చిత్రబృందం. ప్రేమమ్ తెలుగులో రీమేక్‌లో ఈ సినిమా మలయాళ మాతృకలో నటించిన సాయిపల్లవి నటించాల్సింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె అంగీకరించలేదు. దాంతో ఆమె పాత్రలో శృతిహాసన్ నటించింది. ఇలా ఒకరికి చేజారిన అవకాశాలు మరొకరికి అద్భుత విజయాల్ని అందించాయి. అయితే పరిశ్రమలో ఈ సమీకరణాలన్నీ సాధారణమే అయినప్పటికీ ఫలానా సినిమాల్ని తాము చేయలేకపోయామనే భావన మాత్రం తారల మనసుల్ని వెంటాడుతూనే ఉంటుంది.

రంగస్థలంలో అనుపమ

Anupama.jpg రంగస్థలంలో పల్లెటూరి రామలక్ష్మిగా అద్వితీయ అభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది సమంత. గ్లామర్ హంగులకు దూరంగా సాగే ఈ డీగ్లామర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను వరించింది. అఆ, ప్రేమమ్ సినిమాల్లో అనుపమ నటనను ముగ్ధుడైన దర్శకుడు సుకుమార్ రామలక్ష్మి పాత్రను ఈ మలయాళీ ముద్దుగుమ్మ చేత చేయించాలని అనుకున్నారు. ఫొటోషూట్, ఆడిషన్స్ కూడా జరిగాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో సమంతను రామలక్ష్మి పాత్ర వరించింది.

నిత్యామీనన్ చేయాల్సింది...

Nithya-Menon.jpg అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అసమాన అభినయంతో సావిత్రి పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది కీర్తిసురేష్. చక్కటి హావభావాలు, భావోద్వేగాలు పలికించి సావిత్రిని స్ఫురణకు తెచ్చింది. ఆమె కెరీర్‌లోనే మరపురాని చిత్రంగా మహానటి నిలిచింది. అయితే సావిత్రి పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్..నిత్యామీనన్‌ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె అంగీకరించకపోవడంలో కీర్తిసురేష్‌ను అదృష్టం వరించింది. అలాగే ఈసినిమాలో జెమిని గణేషన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించారు. దుల్కర్ సల్మాన్ డేట్స్ అందుబాటులో లేకపోవడంలో విజయ్ చేత ఈ పాత్రను చేయించాలని అనుకున్నారు. కానీ జెమిని పాత్ర చేయడానికి విజయ్ సంశయించడంతో తిరిగి దుల్కర్‌సల్మాన్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటించారు.

× RELATED మనసు చేసే మాయ!