ఫుల్‌మీల్స్ దొరికింది!

ఒకసారి భోజనానికి డబ్బులు లేక ఫంక్షన్‌కు వెళ్లాను. అక్కడ ఫుల్‌మీల్స్ దొరికింది. ఈ సినిమా విజయం నాకు అదే భావనను కలిగించింది అన్నారు సునీల్. ఆయన ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం సిల్లీ ఫెలోస్. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మించారు. చిత్రాశుక్లా, నందినిరాయ్ కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. సునీల్ మాట్లాడుతూ ఈ సినిమా విజయం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. నరేష్‌తో కలిసి పనిచేయడం చక్కటి అనుభూతిని మిగిల్చింది అన్నారు. కితకితలు బెండు అప్పారావు తరహాలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్న చిత్రమిది. మాస్‌తో పాటు ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఆస్వాదిస్తున్నారు. కథను, వినోదాన్ని నమ్మి ఈ సినిమా చేశాం అని నరేష్ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ మా సంస్థ నుంచి అన్నీ రాజకీయ నేపథ్య చిత్రాలే వస్తున్నాయని కొందరన్నారు. అందుకే పూర్తి వినోధభరితంగా ఈ సినిమాను తీశాం. ప్రేక్షక ఆదరణ బాగుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.