ఇమ్రాన్‌ఖానే ప్రధాని.. ఆరేళ్ల కిందటే చెప్పిన ఇండియన్ లెజెండ్!

ఇస్లామాబాద్: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 22 ఏళ్ల తర్వాత మొత్తానికి పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ప్రధాని కాబోతున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ రాకపోయినా.. ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆయన ఇప్పుడు ప్రధాని అయ్యారుగానీ.. టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆరేళ్ల కిందటే ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడా వీడియో బయటకు వచ్చింది. 2012 ఏషియాకప్‌లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెంటరీ ఇస్తున్న సన్నీ.. పక్కనే ఉన్న మరో పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజాతో ఈ విషయాన్ని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో కామెంటరీ ఇస్తూ.. తాను ఆడే రోజులను రమీజ్ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా గవాస్కర్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ ఇమ్రాన్‌ఖాన్ గురించి చెప్పాడు. అప్పట్లో ఎలాంటి బౌలర్‌నైనా వివ్ రిచర్డ్స్ తుత్తునియలు చేసేవాడు. కానీ స్వింగ్ సుల్తాన్ అయిన ఇమ్రాన్‌ఖాన్‌ను కూడా ఓ ఆటాడుకున్న వ్యక్తి గవాస్కర్. నేను ఆ సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండేవాడిని. ప్రతి పది నిమిషాలకు ఇమ్రాన్ నా దగ్గరకు వచ్చి.. చూడు ఇతడు ఎలా ఆడుతున్నాడో అంటూ బాధపడేవాడు అని రమీజ్ అన్నాడు. ఈ సందర్భంగా గవాస్కర్ స్పందిస్తూ.. నువ్వు ఎవరిని వెక్కిరిస్తున్నావో తెలుసుకో. కాస్త జాగ్రత్త. ఆయన కాబోయే ప్రధానమంత్రి అని గవాస్కర్ అన్నాడు. సన్నీ ఈ మాట అనగానే ఇద్దరూ బిగ్గరగా నవ్వారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారిపోయింది.

Related Stories: