నాస్తికుడు లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో తెలియాలంటే..

భక్తుల్ని అనుగ్రహించి వారి కోరికలు తీర్చాల్సిన దేవుడే ఆగ్రహించడానికి కారణమేమిటి? దేవుడిపై నమ్మకంలేని ఓ నాస్తికుడు దైవసంకల్పంతో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సుమంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈషా రెబ్బ కథానాయిక. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నిర్మాత మాట్లాడుతూ.. సుమంత్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో మిస్టరీ థ్రిల్లర్‌గా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతతో ప్రతిక్షణం ఆసక్తిని పంచుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామిపై వచ్చే ఓ అద్భుతమైన పాటకు ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ గీతంలోని సాహిత్యపు విలువలు నచ్చి ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రాన్ని అందించడానికి అంగీకరించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నాం అని తెలిపారు. తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి.

Related Stories: