ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిటిషన్!

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో.. ఉన్న రైల్వే వ్యవస్థను బాగు చేయకుండా.. కొత్తగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి ఇటీవలే జపాన్ ప్రధాని షింజోతో కలిసి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓ ఇద్దరు విద్యార్థినులు పోరాటం మొదలుపెట్టారు. ముంబై లోకల్ రైల్వే వ్యవస్థను ఆధునీకరించకుండా బుల్లెట్ రైలు ప్రాజెక్టు తీసుకురావడంపై విద్యార్థినులు శ్రేయ చవాన్, తన్వి మహాపంకర్ కలిసి పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. 24 గంటల్లోనే 4,327 సంతకాలను సేకరించారు. పిటిషన్‌లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్లను చేర్చారు. ఈ సందర్భంగా శ్రేయ చవాన్(17) మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20న లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ కిందపడిపోయి చనిపోయాడు. కళాశాల విద్యార్థులు కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణాలు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో ప్రతి రోజు రైలు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోతున్నారని చెప్పారు. ఈ క్రమంలో ముంబై లోకల్ ట్రైన్ వ్యవస్థను బాగు చేయాలి. కానీ కొత్తగా బుల్లెట్ రైలుకు నిధులు కేటాయించడం సరికాదన్నారు. రెండు రోజుల క్రితం ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పిటిషన్‌ను దాఖలు చేస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?