విరాట్‌కు చేరువలో స్టీవ్‌స్మిత్..

హైదరాబాద్: టెస్టు ర్యాంకింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ విరాట్‌కు కేవలం తొమ్మిది పాయింట్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టిన స్మిత్ 913పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించాడు. అలాగే రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ విసిరిన బౌన్సర్‌కు గాయపడ్డ అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో ఇండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ఉండగా, శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే తొలిసారి టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు. అతను 8 ర్యాంకులో నిలిచాడు. బౌలర్ల విషయానికొస్తే, ప్యాట్ కమిన్స్ తొలిస్థానం ఆక్రమించాడు. జడేజా ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. అతని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ 10వ స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్లలో జడేజా మూడో స్థానంలో ఉండగా, జేసన్ హోల్డర్, షకిబ్ హల్ హసన్ టాప్‌లో కొనసాగుతున్నారు. టీమ్ ర్యాంకింగ్‌లో ఇండియా 113 పాయింట్లతో టాప్‌లో ఉండగా, న్యూజీలాండ్ 111పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.