ఎస్సీ యువతకు భరోసా

-200 మందికి శిక్షణ ప్రారంభించిన ఎన్‌ఐఎమ్మెస్‌ఎమ్‌ఈ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయంఉపాధి రుణాలు అందించడంతోపాటు వృత్తివిద్యా కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. సమాజ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఎన్‌ఐఎమ్మెస్‌ఎమ్‌ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడుతగా యానిమేషన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో 200 మందికి శిక్షణ ఇస్తున్నది. ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కార్పొరేషన్ ఎండీ లచ్చీరాం భూక్యా తెలిపారు.

ఉద్యోగాలు కల్పించే దిశగా.. వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసినవారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. మోటర్ డ్రైవింగ్, ఆటోమొబైల్, సెల్‌ఫోన్ రిపేరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్లంబింగ్, కంప్యూటర్ శిక్షణ, ఎయిర్ హోస్టెస్, చెఫ్, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. నాలుగున్నరేండ్లలో 2,463 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.10.40 కోట్లు వెచ్చించింది. ఇంజినీరింగ్ పూర్తిచేసినవారికి ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం డ్రైవింగ్, ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్, డేటా ప్రో, హౌస్‌వైరింగ్, జనరల్ వర్క్స్, సూపర్‌వైజర్, నర్సిం గ్, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్, ల్యాండ్ సర్వే, టైలరింగ్, కంప్యూటర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ట్రైనింగ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.