పకడ్బందీగా మిడ్‌డే మీల్

>

క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ అధికారులు -త్వరలో ప్రభుత్వ కాలేజీల్లో అమలుకు ప్రయత్నాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు కొనసాగిస్తున్నది. ప్రభుత్వం సన్నబియ్యం ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి గ్రామీణ, పేద విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మధ్యా హ్న భోజనాన్ని 9, 10 తరగతి విద్యార్థులకు కూడా అందిస్తున్నారు. పథకాన్ని పకడ్బందీంగా అమలుచేసేందుకు పాఠశాల విద్యాశాఖలోని అడిషనల్ డైరెక్టర్లు జిల్లాల్లో పర్యటిస్తూ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. పథకం లోటుపాట్లను సరిచేసి ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పెంచడంతోపాటు పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుం టున్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కేజీబీవీలు, Model schools, తెలంగాణ గురుకులాల్లో కామన్ మెనూ అమలుచేస్తున్నారు. పిల్లలకు ప్రొటీన్లు అందివ్వడం కోసం రెండుసార్లు మాంసంతో భోజనం పెడుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ టు పీజీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం కొనసాగిస్తున్నదని పేర్కొంటున్నారు. త్వరలో ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.