వాస్తవ సంఘటనతో ఖాకీ

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ధీరన్ అదిగారమ్ ఒండ్రు తెలుగులో ఖాకీ పేరుతో అనువాదమవుతున్నది. ది పవర్ ఆఫ్ పోలీస్ ఉపశీర్షిక. వినోద్ దర్శకుడు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్‌గుప్తా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 2005 సంవత్సరంలో జరిగిన ఓ వాస్తన సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాడు. పోలీస్ పవరేంటో తెలియజెప్పే చిత్రమిది. సంఘ విద్రోహక శక్తులపై ఒక పోలీస్ అధికారి సాగించిన సమరమేమిటన్నది ఆసక్తికరంగా వుంటుంది. జిబ్రాన్ చక్కటి సంగీతాన్నందించారు. అతి త్వరలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. అభిమన్యుసింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, ఆర్ట్: కె.ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బారాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌గుప్తా, సుభాష్ గుప్తా.