కాంగ్రెస్‌లో చేరాలంటూ బెదిరింపులు!

-మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్,ఆయన సోదరుడిపై అట్రాసిటీ కేసు నమోదు జగద్గిరిగుట్ట: కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌పై బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదయింది. గాజులరామారం దేవేందర్‌నగర్‌లో నివాసముండే టీఆర్‌ఎస్ కార్యకర్త మాడవత్ రమేశ్‌ను కూన శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 8న తమ కార్యాలయానికి పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తెచ్చారు. అతడు ఒప్పుకోకపోవడంతో ఫోన్‌చేసి అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మరుసటి రోజు తన ఇంటిముందు నుంచి పాదయాత్ర నిర్వహిస్తూ తనను కులం పేరుతో ఇష్టానుసారంగా దుర్భాషలాడారని రమేశ్ తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురై జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే సోదరులపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. అఖిల భారత సేవాదళ్ గాజులరామారం అధ్యక్షుడు రమేశ్‌ను కులం పేరుతో దూషించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా అఖిల భారత సేవాదళ్ ఆధ్వర్యంలో బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.